తెలంగాణలో నేడు స్కూళ్ళ బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా స్కూళ్లు, హాస్టళ్ళు, గురుకులాల్లో పెడుతున్న అల్పాహారాలు, భోజనాలు సరిగా లేకపోవడం, వసతుల కొరత వంటి అంశాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓ బాలిక మృతి చెందడం కూడా అందర్నీ ఆవేదన చెందేలా చేసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, కలెక్టర్లపై సీరియస్ అవ్వడం, ప్రత్యేక ఆదేశాలివ్వడం వంటివి జరిగాయి. ఐతే.. తాజాగా SFI కీలక నిర్ణయం తీసుకుంది.
గురుకుల స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ.. 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బంద్ పాటిస్తున్నట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ప్రకటించింది. ఫుడ్ పాయిజన్‌తో పిల్లలు చనిపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని SFI నిర్వాహకులు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా, విద్యారంగానికి మంత్రి లేకపోవడం దురదృష్టకరం అని మండిపడ్డారు. సమస్యలపై ప్రభుత్వం సమీక్ష కూడా జరపట్లేదని భగ్గుమన్నారు.