సినీ పరిశ్రమలో ఎక్కువగా ప్రయోగాలకు సిద్ధమయ్యే నిర్మాతల్లో ఒకరు దిల్‌రాజు. భారీ చిత్రాలను నిర్మించడంలో ఎప్పుడూ ఈయన ముందుంటారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి జటాయు అనే ఫాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. దీనిని విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించాలని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారు. స్టోరీ పరంగానే కాకుండా ఈ సినిమా గ్రాండ్ విజువల్స్, కొత్త కాన్సెప్ట్‌తో యూనిక్ సినిమాగా ఉండబోతుందనే టాక్ వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. స్క్రిప్ట్ లెవెల్ నుంచే జటాయు పట్ల దిల్ రాజుకు పూర్తిగా సంతృప్తికి రాలేదని సమాచారం. మోహనకృష్ణ ఇంద్రగంటి కథా కథనాలను ఎంతో జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిలబెట్టే విధంగా స్క్రీన్‌ప్లే లేదనే అభిప్రాయంతో దిల్ రాజు వెనక్కి తగ్గారని టాక్. స్క్రిప్ట్‌లో మరిన్ని మార్పులు చేయాలనుకుంటున్నా, కాంబినేషన్ ను నమ్మి అంత భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ తీసుకోవడం సరైనదేనా అనే అనుమానాలు నిర్మాతలో మొదలయ్యాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ భారీ స్థాయిలో ఫ్లాప్ అవ్వడం కూడా దిల్ రాజు నిర్ణయంపై ప్రభావం చూపింది. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఆ సినిమా పూర్తిగా విఫలమై, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద నష్టాన్ని మిగిల్చింది. దీంతో విజయ్ మీద అంత భారీ బడ్జెట్ పెట్టడం, ముఖ్యంగా ఒక ఫాంటసీ అడ్వెంచర్ తరహా సినిమాకు ఆయనని సెలెక్ట్ చేయడం సరైన నిర్ణయమా అనే డౌట్స్ నిర్మాతలో ఎక్కువయ్యాయి. దీంతో హీరోను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం హీరో మాత్రమే కాదు, డైరెక్టర్ ఎంపిక విషయంలోనూ దిల్ రాజు కొత్త ఆలోచనలో పడ్డారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఇప్పటి వరకు పెద్ద బడ్జెట్ సినిమాలు డీల్ చేయలేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘వి’ కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓటీటీలో విడుదలైనా ఆ ప్రాజెక్ట్ మీద పెద్దగా హైప్ రాలేదు. దీంతో మోహనకృష్ణ దర్శకత్వంలో భారీ సినిమా ప్లాన్ చేయడం సేఫ్ కాదనే సలహాలు కూడా వచ్చాయట. ప్రస్తుతం దిల్ రాజు ఈ జటాయు ప్రాజెక్ట్‌ను పూర్తిగా కొత్త దారిలో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడు, కొత్త రైటర్స్‌తో కథను మరింత కమర్షియల్‌గా, భారీగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్. దిల్ రాజు చాలా కాలంగా ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జటాయు కథతో ప్రభాస్‌ను అప్రోచ్ చేసే యోచనలో ఉన్నాడని టాక్.