ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో, ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా, ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు.
షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి, పర్యటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కచ్చితంగా ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని ఆమె అన్నారు. దీంతో ఆమె నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.