– సంక్రాంతికి పంజాయితీ ఎన్నికల నోటిఫికేషన్
– డిసెంబరు 10 నాటికి సమగ్ర కులగణన నివేదిక
– ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలకు పోలింగ్
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఫిబ్రవరి రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే సంక్రాంతికి షెడ్యూల్ను విడుదల చేయనుంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. పంచాయతీ ఎన్నికలు అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిలు నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ‘ఇద్దరు పిల్లలకు మించి పిల్లలు’ నిబంధనను ప్రభుత్వం ఇప్పటికే ఎత్తివేసింది. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులకు సంబంధించి వేగవంతం చేసినట్టు సమాచారం.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేపెట్టి.. ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను పూర్తిచేసి, స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగానే సమగ్ర కులగణన చేపట్టారు. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేసి.. డిసెంబరు 10నాటికి కమిషన్ నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే బీసీ రిజర్వేషన్లపైఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ప్రకారంగా బీసీ రిజర్వేషన్లను పెంచే అవకాశాలను పరిశీలించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనను పాటించాల్సి ఉన్నందున.. ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం ఆలోచిస్తోన్నట్టు సమాచారం.