Monday, May 12, 2025

భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగట్ కు నిరాశే

  • భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగట్ కు నిరాశే
  • వినేశ్ పిటీషన్ ను కొట్టేసిన సీఏఎస్

భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ కు నిరాశే ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కుతుందేమోనని ఎంత ఎదురు చూసినా ఫలితం మాత్రం దక్కలేదు. తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్‌ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ ను కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ కొట్టేసింది. ఆగస్టు 7న వినేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అడ్‌హక్‌ డివిజన్‌ సోల్‌ ఆర్బిట్రేటర్‌ అనబెల్‌ బెనెట్‌ బుధవారం తీర్పునిచ్చారు. పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌ ఫోగట్ కనీసం రజత పతకం ఖాయం చేసింది. ఐతే రెండవ రోజు ఆమె బరువు చూసే సమయానికి వంద గ్రాములు అదనంగా ఉండటంతో వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.

అనర్హత వేటును సవాలు చేస్తూ సంయుక్తంగా తనకు వెండి పతకం ఇవ్వాలని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ ను ఆశ్రయించింది వినేశ్ ఫోగట్. ఆమె పిటిషన్‌ ను స్వీకరించిన సీఏఎస్.. ఈ నెల 11న తీర్పును ఇవ్వనున్నట్లు భావించారు. తరువాత 13కు, మళ్లీ ఈ నెల 16 లోపు తీర్పు చెబుతామని వాయిదా వేసింది కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌. దీంతో వినేశ్ ఫోగట్ కు ఖచ్చితంగా రజత పదకం వస్తుందని అంతా భావించారు. కానీ అందరి ఆశలను గల్లంతు చేస్తూ.. వినేశ్‌ ఫోగట్ అభ్యర్థనను తిరస్కరిస్తూ అడ్‌హక్‌ డివిజన్‌ సోల్‌ ఆర్బిట్రేటర్‌ అనబెల్‌ బెనెట్‌ తన నిర్ణయాన్ని వెల్లడించి షాక్ ఇచ్చారు.

కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ నిర్ణయంపై ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. యునైటెడ్‌ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్‌ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా వినేశ్‌ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీఏఎస్ కొట్టివేయడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆమె చెప్పారు. కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వినేశ్‌ ఫోగట్ పై తీవ్ర ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. అథ్లెట్ల, మరీ ముఖ్యంగా మహిళా అథ్లెట్ల మానసిక, శారీరక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవడంలో కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ విఫలమైందని పీటీ ఉష ఆరోపించారు.

వినేశ్‌ ఫోగట్ కు ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పిన పీటీ ఉష.. వినేశ్ ఫోగట్ కేసుకు సంబందించి న్యాయపరంగా ఇంకా ఏమైనా అవకాశాలున్నాయేమో మరోసారి పరిశీలిస్తామని అన్నారు. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌ కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు శతవిధాలా ప్రయత్నించి వినేశ్‌ ఫోగట్ విఫలమైంది. ఈ బాధతోనే ఆమె రెజ్లింగ్‌ కెరీర్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com