అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న మాజీ సీఎం కేసీఆర్‌కు అమెరికా ఎంబసీ అధికారులు షాక్ ఇచ్చారు. కేసీఆర్ వీసాను రిజెక్ట్ చేశారు. మే నెల చివరలో అమెరికా వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మనవళ్ల గ్రాడ్యుయేషన్ సెరిమనీతోపాటు పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడులకు హాజరుకావాలని భావించారు. తాజాగా బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కార్యాలయం తిరస్కరించింది. అమెరికా టూర్ కోసం రెండు నెలల కిందట సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీసుకు వెళ్లారు కేసీఆర్ దంపతులు. ఆ కేంద్రంలో పాస్‌పోర్టు పునరుద్ధరణ చేసుకున్నారు. యూఎస్ వెళ్లడంతో మనవాళ్ల గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.
కేసీఆర్ వీసా తిరస్కరణతో ఆయన అమెరికా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. తొలుత నార్త్ కరోలినాలో కవిత కుమారుడి గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సివుంది. ఆ తరువాత న్యూయార్క్ లో కేటీఆర్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. జూన్ ఒకటిన తెలంగాణ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం డల్లాస్‌లో నిర్వహించే BRS పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సైతం హాజరు కావాలని భావించారు కేసీఆర్. వీసా రిజెక్ట్ కావడంతో ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇక, డల్లాస్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు కేవలం కేటీఆర్ మాత్రమే హాజరుకానున్నట్లు ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తెలిపింది. కేసీఆర్ వీసా రిజెక్టు అయిన విషయం తెలియగానే పలువురు ఎన్నారైలు నిరాశలో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కవిత మాత్రం డల్లాస్‌లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకకు హాజరుకావడం లేదని పార్టీ వర్గాల మాట. కేసీఆర్‌కు వీసా రాకపోవడంతో హరీశ్‌రావు కూడా అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.