తమిళ స్టార్ హీరో విశాల్ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. పందెం కోడి సినిమా దగ్గర నుంచి ఆయనను మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. రంగు తక్కువనేగాని అసలు ఆ కట్‌అవుటే వేరనుకోండి. అయితే ప్రస్తుతం విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైన ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ‘మదగజరాజ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో విశాల్‌ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. బాబోయ్ విశాల్ ఇలా అయ్యాడేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాల్ కనీసం చేతిలో మైక్ పట్టుకోలేక పోతున్నారు. చేతులు బాగా వణుకుతున్నాయి, ఎక్కువ సమయం నిల్చోడానికి కూడా అతడికి సాధ్యం కాలేదు. దాంతో విశాల్ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు. విశాల్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నిజం కాదని వైద్యులు స్వయంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్ బులిటెన్‌లో వైరల్ ఫీవర్‌తో విశాల్ బాధ పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇటీవల విశాల్ హెల్త్ గురించి ప్రముఖ నటి కుష్బూ స్పందించారు. ఆమె మాట్లాడుతూ విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారు. అయితే తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో ఆయన వచ్చారు. కానీ జ్వరం తీవ్రత నేపథ్యంలో ఈవెంట్ జరిగిన వెంటనే నేరుగా విశాల్‌ని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా ఆమె తెలియజేశారు.