ఆ అక్షరాలకు ‘ముహూర్తం’ పెట్టారంటే సినిమా ‘సూపర్’ హిట్ కొట్టాల్సిందే..! ఎలాంటి సబ్జెక్టుకైనా ‘రెడీ’ అంటూ ‘దూకుడు’ చూపించాల్సిందే.. ఆ కుంచె నుంచి ‘పరుగు’ తీసే అక్షరాలు ప్రేక్షకుల గుండెల్లో ‘దిల్’గా నిలిచి పోతాయి. సినిమా అనే ‘బొమ్మరిల్లు’లో ‘దేశముదురు’, ‘పోకిరీ’, ‘డాన్ శీన్’, ‘ఆర్య2’, ‘అప్పల్రాజు’, ‘శివమణి’, ‘ఏకలవ్‌యుడు’, ‘దొంగోడు’, ‘ఆగడు’.. ఇలా ఎలాంటి వారికైనా ఆ కుంచె ఓ రూపమిస్తుంది. నిరంతరం ‘కితకితలు’ పెడుతూ ‘ఇంకోసారి రెడీ’ అంటూ పాతికేళ్లుగా నిరంతరం వెలుగుతోంది వివ రెడ్డి అనే ఓ అక్షర ‘ఆయుధం’. వివ.. అంటే ‘విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు’కి షార్ట్ కట్. ఈ పబ్లిసిటీ డిజైనర్ చేతిలో రూపొందే ‘చిత్రం’.. చలనచిత్రాన్ని పరిచయం చేస్తుంది.. సినిమా ఇతివృత్తమేంటో చెబుతుంది.
ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థియేటర్‌లకు పరుగులు పెట్టిస్తుంది. అంతటి శక్తి ఉన్న వివ కుంచెకు పాతికేళ్లు నిండాయి. ఇదే సమయంలో ‘ఈనాడు’ (మే 24న) విష్ణువర్థన్ రెడ్డి జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ. సినీ ‘ప్రస్థానం’ ఇలా…అనుకున్న రంగంలో విజయం సాధిస్తే జీవితంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. వరంగల్‌కు చెందిన విష్ణువర్థన్ రెడ్డిది దిగువ మద్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే చిత్రకళలో ఎంతో ప్రతిభ చూపించేవాడు. స్కూల్‌లో డ్రాయింగ్ చక్కగా వేసేవాడు. ఓ సారి స్కూల్ వయసులోనే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. తన ప్రతిభకు తగిన ప్లాట్‌ఫాం కావాలి. 1999లో హైదరాబాద్ వచ్చాడు విష్ణువర్థన్ రెడ్డి. ఆ క్రమంలో జేఎన్‌టీయు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏ చేశాడు.