అమరావతి: విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి ఆకస్మిక మృతిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తక్షణమే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ లో ఏడో తరగతి చదువుతున్న శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన కొణతాల శ్యామలరావు(12) ఎప్పటిలాగే ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాడన్నారు. కొద్ద సేపటి తరవాత కళ్లు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులతో చెప్పి కుప్పకూలిపోయాడన్నారు. ఈ విషయం హాస్టల్ సిబ్బందికి విద్యార్థులు తెలపగానే స్థానిక మహారాజా ఆసుపత్రికి తరలించారన్నారు.
శ్యామలరావును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారన్నారు. గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చుననే అనుమానాలు వైద్యులు వ్యక్తంచేశారన్నారు. పోస్టు మార్టం తరవాతే పూర్తి విషయాలు వెల్లడవుతాయని తెలిపారు. శ్యామలరావు మృతిపై విద్యార్థి తండ్రికి హాస్టల్ సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారమిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థి శ్యామలరావు మృతి బాధాకరమైన విషయమన్నారు. ఘటనపై పూర్తిస్థాయి వివరాలివ్వాలని తక్షణమే అందజేయాలని విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.