Friday, May 9, 2025

బెడిసికొట్టిన వ్యూహం తెరకెక్కని శపథం

  • బెడిసికొట్టిన వ్యూహం
  • తెరకెక్కని శపథం
  • పొలిటికల్​ మూవీ ఆశల్లో ఏపీ నేతలు

రకరకాల జోనర్లలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలోనే ట్రెండ్ సెట్టింగ్ మూవీలు చేసిన ఆర్జీవీకి ఇటీవల రెండు సినిమాలు పెద్ద షాక్​ ఇచ్చాయి. ఏపీ సీఎం జగన్​ కోసం తీసిన రెండు సినిమాల వ్యూహాలు బెడిసికొట్టి.. బొక్కాబోర్లా పడ్డాయి. నిజానికి, ఈ మధ్య కాలంలో మాత్రం కాంట్రవర్శీ చిత్రాలతో ఆర్జీవీ రచ్చ లేపుతున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పాలిటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు. ఏపీ సీఎం జగన్​ కోసం అన్నట్టే సినిమాలు తెరకెక్కించారు.

బెడిసికొట్టినట్టే..!

ఏపీ పాలిటిక్స్‌పై ఎన్నో చిత్రాలను రూపొందించిన రాంగోపాల్ వర్మ.. తాజాగా ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను తీశాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాలు రూపొందించాడు. ఇందులో ‘వ్యూహం’ ఇటీవలే విడుదలైంది. చాలా కారణాలు, రకరకాల అడ్డంకుల మధ్య విడుదలైన వ్యూహం ఒక్కసారిగా బెడిసికొట్టింది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాలకు గతంలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. దీంతో పలుమార్లు సినిమాలు వాయిదా పడ్డాయి. చివరికి ‘వ్యూహం’ సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన, ‘శపథం’ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తామని ప్రకటించాడు. కానీ, అనివార్య కారణాల వల్ల ‘వ్యూహం’ మూవీని మార్చి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అయితే, డిజాస్టర్ మూవీగా వ్యూహం–2 ఇండస్ట్రీలో నిలిచింది. ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వ్యూహం’ సినిమా అనుకున్న విధంగా టాక్‌ను తెచ్చుకోలేదు. ఫలితంగా ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ కరువు అయ్యారు. ఇలా నాలుగైదు రోజులు ప్రదర్శించినా ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం దక్కలేదు. ఫలితంగా 25 కోట్ల రూపాయలతో తీసిన ఈ చిత్రం జీరో షేర్ మూవీగా మారి డిజాస్టర్ అయింది.

ఇక, ఏపీ ఫైబర్‌నెట్‌లో శపథం మూవీ విడుదలైంది. ‘వ్యూహం’ రిలీజ్ ఫార్ములా బెడిసి కొట్టడంతో రాంగోపాల్ వర్మ ‘శపథం’ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని తేలిపోయింది. దీంతో ఈ సినిమాను ఏపీ ఫైబర్‌నెట్‌లో వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన మొదటి పార్ట్ ‘శపథం ఆరంభం’ను మార్చి 7వ తేదీనే విడుదలైంది. తాజాగా ‘శపథం అంతం’ను అందుబాటులోకి తెచ్చారు.

ఎవరికి షాక్​

సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలు రాంగోపాల్​ వర్మకు షాక్​ అని అంటున్నా.. ఒక విధంగా జగన్ కు, వైసీపీ శ్రేణులకు తట్టుకోలేని షాక్ ఇచ్చాయి. తనదైన చిత్రాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని ప్లాన్ చేసుకుంటూ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ‘వ్యూహాలు’ ఫలించలేదు. ఇటు శపథం కూడా తీరలేదు. దీంతో థియోటర్ల రూటు మార్చేసి ఏపీ ప్రభుత్వం సహకారంతో ఫైబర్‌నెట్‌లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇలా వర్మకు సినీ ఇండస్ట్రీలో కోలుకోలేని షాక్ తగిలినట్లైంది. దీనిపై తెలుగుదేశం, జనసేన పార్టీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చెప్పుకోలేం

అయితే, సినిమాలు ఎలా ఉన్నా.. ఈ రెండు సినిమాల ప్రభావం మాత్రం వైసీపీ అధినేత, శ్రేణులపై పడింది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన యాత్ర–2 ఎక్కడా ఫాయిదా చూపించలేదు. యాత్ర తొలి భాగం సూపర్​ సక్సెస్​ అయినప్పటికీ.. యాత్ర సీక్వెల్​ మాత్రం బెడిసికొట్టింది. అయితే, ఏపీ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి. నేడో, రేపో నోటిఫికేషన్​ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాలు కలిసి వస్తాయని అధికార పార్టీ భావించింది. కానీ, యాత్ర –2 ఫెయిల్​ కావడం, అదే కోవలో వ్యూహం, శపథం కూడా మిగలడంతో వైసీపీ శ్రేణులు సమర్ధించుకోలేకపోతున్నాయి.

సినిమా ఫైట్​

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో తీసిన కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ పెంచేలా ‘యాత్ర 2’ వస్తే… ఆయనకు వ్యతిరేకంగా ‘రాజధాని ఫైల్స్’ సినిమా వచ్చింది. ఇదే వరుసలో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’,’శపథం’ వచ్చాయి. ఇక, జ్యోతిక నటించిన తమిళ సినిమా ‘రాక్షసి’ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసినప్పటికీ… మళ్లీ ‘అమ్మ ఒడి’ పేరుతో థియేటర్లలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎవరి పొలిటికల్ ఎజెండాలు వాళ్లవి. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే… ‘యాత్ర’ ఫేమ్ మహి వి రాఘవ్ తీసినట్లుగా ఆయనే యాత్ర–2 విఫలం కావడం, ఇటు వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ కూడా విఫల ప్రయత్నం చేయడం కొంత ఇబ్బందికరంగానే మారింది.

నిజానికి, “ ప్రతినాయకుడు ఎంత బలవంతుడు అయితే కథానాయకుడి ధీరత్వం, వీరోచితం అంత పడుతుంది – సినిమా రాసే, తీసే దర్శక, రచయితలు అనుసరించే సూత్రం ఇది. బలవంతుడిని ఢీ కొట్టినప్పుడు ఎదుటి వ్యక్తిలో బలం తెలుస్తుంది. రాజకీయ నేపథ్య సినిమాలు తీసే దర్శకులు ఇది విస్మరిస్తునట్లు కనబడుతోంది. ‘మనం తలపడుతున్నది చంద్రబాబు నాయుడితో! తక్కువ అంచనా వేయకూడదు’ అని ‘యాత్ర 2’లో జీవా (వైఎస్ జగన్ మోహన్ రెడ్డి) పాత్రధారితో డైలాగ్ చెప్పించారు మహి వి రాఘవ్. కానీ తెరపై మాత్రం చూపించిన తీరు ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. వాస్తవానికి, వైఎస్ జగన్ ఇమేజ్ పెంచేలా ‘యాత్ర 2’ ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కానీ, జగన్​ను గొప్పగా చూపించే క్రమంలో క్రమ పద్ధతిలో చంద్రబాబు, తెలుగు దేశం పార్టీని విలన్ చేస్తూ వెళ్లారు. రైతు రుణమాఫీ అమలు సాధ్యం కాదని తెలిసి ఆయన హామీ ఇచ్చినట్లు చూపించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టైంలో చంద్రబాబు మనసులో ఏముందో ఆయనకు ఎరుక. అక్కడ కల్పిత సన్నివేశాన్ని జోడించారు. రుణమాఫీ చేయలేదు కనుక నిజమని నమ్మేలా ఓ సన్నివేశాన్ని రూపొందించారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత అందులో ఒకరు మంత్రి పదవి చేపట్టడం నిజమే. చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేయడంతో వాళ్లు వెళ్లినట్లు చూపించారు.

కానీ, ఇదే కోణంలో వచ్చిన వ్యూహం సినిమాలో దర్శకుడు చంద్రబాబు విలనిజాన్ని చూపించినా.. అదే క్రమంలో శ్రవణ్​ కళ్యాణ్​ అంటూ పవన్​ కళ్యాణ్​ను కేవలం రాజకీయ జోకర్​గా తెరకెక్కించారు. ఇది ఏపీలోని కొన్ని వర్గాలను తట్టుకోలేని పరిస్థితులను కల్పించింది.

మరోవైపు ఆర్జీవీ, మహీ రాఘవన్​ సినిమాలతో జగన్​ఇమేజ్​ను పెంచే పనిలో ఉంటే.. అటు టీడీపీ బంధం దర్శకులు కూడా ‘రాజధాని ఫైల్స్’ నిర్మాణం చేశారు. ఈ సినిమా విడుదలపై ఏపీ హైకోర్టు ముందుగా స్టే విధించింది. సినిమా రిలీజ్​ అయిన వెంటనే హుటాహుటిన ఏపీలో పోలీసులు థియేటర్లకు వెళ్లి షో మధ్యలో ఉండగా ఆపించారు. ప్రేక్షకుల్ని హాళ్ల నుంచి బయటకు పంపించారు. ముఖ్యమంత్రి పాత్రధారి గొడ్డలితో బాత్ రూమ్ లో నరికి చంపి, గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పమని ఆదేశించినట్లు ఉంది. వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా గొడ్డలి పోటుకు ప్రాణాలు విడిచిన సంగతి ప్రజలు అందరికీ తెలుసు. ఆ కేసు కోర్టులో ఉంది. అందులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి పాత్రధారి స్వయంగా గొడ్డలితో తన పార్టీ ఎంపీని చంపినట్లు చూపించడం తటస్థ ఓటర్లు, ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపించింది. ‘రాజధాని ఫైల్స్’ సినిమాలో గుడివాడ క్యాసినో అంటూ తీసిన పాటపై అమరావతి రైతుల్లో కొందరు ఆఫ్ ది రికార్డ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మెప్పించలేదు

ఇటు మహీ రాఘవన్​ యాత్ర –2, టీడీపీ అనుబంధ దర్శకులు తీసిన రాజధాని ఫైల్స్​, రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ ప్రచార చిత్రాలపై బాహాటంగా విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఏపీలోని తటస్థ ఓటర్లు, కొన్ని వర్గాలను కన్​ఫ్యూజ్​ చేసే విధంగా ఉన్నాయి. సినిమా బదులు వర్మ స్పూఫ్ చేస్తున్నారని కామెంట్స్ చేశారు. నిజానికి, మహి వి రాఘవ్ తీసిన ‘యాత్ర’, ‘యాత్ర 2’ సినిమాలు వైఎస్ ఫ్యామిలీ ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. ‘రాజధాని ఫైల్స్’ రాజకీయ చర్చకు మాత్రమే ఆస్కారం కల్పించింది. థియేటర్లకు ఎక్కువ స్థాయిలో ప్రేక్షకుల్ని రప్పించలేదు. మహి వి రాఘవ్, రామ్ గోపాల్ వర్మ వెనుక వైసీపీ ఉందని స్పష్టంగా తేలింది. అయితే, సినిమా పరిశ్రమలో ఎంతో మంది అభిమానులు ఉన్న తెలుగు దేశం పార్టీ ఈ ఒక్క విషయంలో వెనుకబడిందని చెప్పుకోవాలి. ఇలాంటి క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సోదరుని కుమారుడు నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతినిధి 2’ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మహి తరహాలో పద్ధతిగా వైసీపీ అవినీతి పాలన, అరాచకాలను ఎండగట్టే విధంగా ఆ సినిమా ఉంటుందని తెలుగు దేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com