టికెట్ సేల్స్ ద్వారా ఆదాయంలో టాప్
పురావాస్తు శాఖ ఆధీనంలోని కట్టడాల్లో.. టికెట్ సేల్స్ ద్వారా అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న వాటిలో తాజ్‌మహల్ అగ్రస్థానంలో ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో లిఖితపూర్వంగా వెల్లడించారు. మొఘల్ కాలం నాటి తాజ్‌మహల్‌కు విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఆ పాలరాతి కట్టడాన్ని తిలకించేందుకు రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ కట్టడాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం ఆ సుందర కట్టడం .. పురావాస్తు శాఖ ఆధీనంలో ఉన్నది. అయితే గత అయిదేళ్లలో పర్యాటకులు ఆ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలోనే పురావాస్తు శాఖ ఆధీనంలో ఉన్న నిర్మాణాల్లో.. అత్యధికంగా టికెట్ సేల్స్ జరుగుతున్న వాటిల్లో తాజ్‌మహల్ అగ్రస్థానంలో ఉన్నది. పర్యాటకులకు టికెట్లు అమ్మి, ఆదాయం ఆర్జిస్తున్న ఏఎస్ఐ ఆధీనంలోని కట్టడాల్లో తాజ్‌మహల్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత అయిదేళ్లలో వివిధ ఏఎస్ఐ నిర్మాణాల నుంచి టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం ఎంతో చెప్పాలని మంత్రిని ఓ సభ్యుడు కోరారు.
అయితే పురావాస్తు శాఖ ఆధీనంలో ఉన్న సైట్లకు చెందిన డేటాను మంత్రి సభలో ప్రజెంట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు పురావాస్తు కట్టడాల నుంచి వచ్చిన ఆదాయాన్ని మంత్రి సభకు సమర్పించారు. ఆ జాబితా ప్రకారం టాప్‌లో తాజ్‌మహల్ ఉన్నది. ఇక ఆదాయం ఎక్కువ వస్తున్న ఏఎస్ఐ కేంద్రాల్లో.. ఆగ్రాలోని ఆగ్రా ఫోర్ట్, ఢిల్లీలోని కుతుబ్ మినార్, తమిళనాడులోని మామల్లపురం, కోణార్క్‌లోని సన్ టెంపుల్ ఉన్నాయి. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవరి షా జహాన్ యమునా నది తీరంలో తాజ్‌మహల్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.