అర్ధరాత్రి దాటేవరకు చర్చ.. ఆ తర్వాత ఆమోదం
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత జరిగిన ఓటింగ్ జరిగింది. 128 మంది బిల్లుకు అనుకూలంగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ బిల్లును ఆమోదించారు. దిగువ, ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం వల్ల రాష్ట్రపతి ఆమోదం కోసం పంపన్నారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. అంతకుముందు లోక్‌సభలోనూ సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
వక్ఫ్ బిల్లును మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముస్లింల హక్కులను ప్రభుత్వం గుంజుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ముస్లిం మహిళలకు సాధికారత తీసుకురావడంతోపాటు అన్ని ముస్లిం తెగల హక్కులను ఇది పరిరక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్ల చొక్కాలు ధరించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ బిల్లు ఉద్దేశమని రిజిజు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చివేసిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. తాము మాటల్లో చెప్పమని, చేతల్లో చూపిస్తామని, ముస్లింల సంక్షేమం కోసం పాటుపడేది తాము మాత్రమేనని ఆయన తెలిపారు.
వ్యతిరేకించిన కాంగ్రెస్
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందన్నారు. జేపీసీలో ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదని తెలిపారు. దేశంలో నెలకొన్న మతసామరస్యాన్ని దెబ్బతీయవద్దని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా, కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేనయూబీటీ, వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.
కాగా, వక్ఫ్ బిల్లు 12 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం తెల్లవారుజామున లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు మైనారిటీలకు ప్రయోజనకరమని అధికార ఎన్‌డీఏ బలంగా వాదించగా ప్రతిపక్షాలు దీన్ని ముస్లిం వ్యతిరేకిగా అభివర్ణించాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలన్నీ మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురికాగా బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడడంతో వక్ఫ్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.