Wednesday, November 6, 2024

హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాభివృద్ధి

2050- విజన్‌తో వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం
త్వరలో సిఎం చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ
* వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్థి చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ నగర అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను తమ ప్రభుత్వం కొలిక్కి తీసుకువచ్చిందని అన్నారు. అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎమ్‌సిహెచ్‌ఆర్‌డీలో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. నూతన మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై ప్రధానంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 2050- విజన్‌తో వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గొప్ప చారిత్రిక నేపధ్యం ఉన్న వరంగల్ నగర అభివృద్దికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని అన్నారు. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తారని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని మొదటి దశలో 20 కిలో మీటర్లు, రెండవ దశలో 11 కిలోమీటర్లు, మూడవ దశలో 9 కిలోమీటర్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మరెక్కడా ఎయిర్‌పోర్టు లేదని వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్టు రాబోతోందని అన్నారు. వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించి ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 382 ఎకరాల పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువులో పేరుకుపోయిన పూడికను తీయాలని, ఇందుకు సంబంధించిన పనులను రేపటి నుంచే మొదలు పెట్టాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చెరువును ఖాళీ చేయాలని అధికారులకు సూచించారు . ఈ చెరువు 40 శాతం గుర్రపుడెక్కతో నిండిపోయిందని అన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలు తప్పనిసరిగా స్దానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మామునూరు ఎయిర్ పోర్టు కల సాకారం
వరంగల్ ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టు కల సాకారం కానుందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రయాణికుల సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు అందించే దిశగా ఎయిర్ పోర్ట్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎంతో చర్చిస్తానని మంత్రి సురేఖ తెలిపారు. అత్యుత్తమ నగరంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. జిడబ్ల్యుఎంసి మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఎంఎయుడి ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు చేసినట్లు వెల్లడించారు. జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు అంగీకరించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. కార్గో సర్వీసులు అందుబాటులోకి వస్తే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఉత్పత్తుల రవాణాకు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల రాకపోకలకు ఉపయుక్తంగా వుండి వరంగల్ నగర పురోగతి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఊతంగా నిలుస్తుందని మంత్రి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కె.నాగరాజు, నాయిని రాజేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సిఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, ఎం.ఎ.యూ.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, రోడ్లు , భవనాల కార్యదర్శి హరిచందన, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సత్యశారద, పి.ప్రావీణ్య, జిడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular