Tuesday, December 24, 2024

గులాబీ అభ్యర్థులకు ఓటమి భయం..!

* సహకరించని ద్వీతీయ శ్రేణులు
* కొన్ని నియోజకవర్గాల్లో నేతల అసంతృప్తి..
* కాంగ్రెస్ వైపు చూపులు, భారీగా చేరికలు
* వరంగల్లో మారుతున్న సమీకరణాలు

వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుందా ? అంటే ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వాస్తవమని నిరూపిస్తున్నాయి. జిల్లాలోని వరంగల్ తూర్పు, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ లైనా నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి లకే గులాబీ బాస్ టికెట్లు కేటాయించారు. ఐతే ఆయా స్థానాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో కొంతమంది నాయకులు, ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ , బీజేపీ పార్టీల్లోకి చేరారు. మరి కొంతమంది అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. వారిని అడ్డుకోవాలని సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అభ్యర్థులు గెలుస్తామని పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఓడిపోతామనే భయం పట్టుకుందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

* నేతల పట్ల వ్యతిరేకత
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వైఖరి పట్ల ఆయా నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. వీరంతా సొంత పార్టీ నేతలతో పాటు కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిన ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను సైతం విస్మ‌రిస్తున్నార‌నే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. ప్రతి పనిలో కలగజేసుకుని తమ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారనే కోపంతో మరి కొందరు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, జేపీటీసీలు, ఎంపీటీసీలు, ఛైర్మన్లు, సర్పంచులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో చేరిపోయారు. ఎన్నికల సందడి మొదలై దగ్గర నుంచి చేరికలు ఎక్కువయ్యాయనే చెప్పాలి. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులకు టెన్షన్ పెరుగుతూ వస్తోందనే ప్రచారం జరుగుతోంది.

*ఢీ అంటే ఢీ
ఈ మూడు సెగ్మెంట్లలో సిట్టింగ్ లు ప్రతిపక్ష అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎవరూ గెలిచినా వెయ్యి నుంచి రెండు వేల మధ్య వ్యత్యాసం వుంటుందనలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వున్నాయి. వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. 2014లో ఆమె టీఆర్ఎస్ నుంచి ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్లో చేరారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో నరేందర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆగడాలు భరించలేని చాలా మంది బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కొండా సురేఖ గెలుపు కోసం వారంతా కృషి చేస్తున్నారు.

* పరకాల లో పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. ఇక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. బీ ఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తలపడుతున్నారు. బీజేపీ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కాళీ ప్రసాద్ పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ సారి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. గతంలో నర్సంపేట నియోజకవర్గం నుంచి వరుసగా టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన ఈ సారి కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నుంచి బరిలో ఉన్నారు. ధర్మారెడ్డి కి నియోజక వర్గంలో ఉన్న వ్యతిరేకత రేవూరి ప్రకాష్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. నర్సంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి బరిలో ఉన్నారు. పెద్ది సతీమణి జేపీటీసీ స్వప్న నియోజకవర్గాన్ని ఆమె చేతిలోకి తీసుకోవడంతో పార్టీ నాయకులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఎమ్మెల్యే పై అన్ని వర్గాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ అభ్యర్థి అనుకూలంగా మార్చుకుంటున్నారు.

– తాళ్లపెళ్లి వెంక‌ట్

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com