Thursday, December 26, 2024

ఆరూరి ర‌మేష్.. ఈసారి గ‌ట్టెక్కుతాడా?

* నియోజ‌క‌వ‌ర్గంలో వెల‌మల ఆధిప‌త్యం
* అనుకున్నంత అభివృద్ధి జ‌ర‌గ‌లేదా?
* భూవివాదాల్లో పాత్ర‌పై విమ‌ర్శ‌లు?
* ఎమ్మెల్యేను నేరుగా ప్ర‌జ‌లు క‌ల‌వ‌లేరా?
* సొంత‌పార్టీవారే ఈసారి ఓడిస్తారా?
* ఆకునూరి ముర‌ళీపై గెల‌వ‌డం క‌ష్ట‌మా?

 

( VN Sunder, Senior Journalist)

 

ఆరూరి ర‌మేష్‌.. వ‌ర్థ‌న్న‌పేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తి.. ముచ్చ‌ట‌గా మూడోసారి హ్యాట్రిక్ కొడ‌తాడా? అత‌న్ని ఓడించ‌డానికి కాంగ్రెస్ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్న‌దా? ఒక‌వేళ అత‌ని ప్ర‌త్య‌ర్థిగా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకూనురి ముర‌ళిని కానీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగరాజును కానీ నిల‌బెడితే.. ఆరూరి ర‌మేష్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌వుతుందా? అస‌లెందుకు ఆరూరి ర‌మేష్ గెలుపు ఈసారి క‌ష్టంగా మార‌నుంది? ఆయ‌న చేసిన త‌ప్ప‌లేమిటి? అభివృద్ధి మీద దృష్టి పెట్ట‌కుండా, ప్ర‌జ‌ల్ని పట్టించుకోకుండా కేవ‌లం ధ‌నార్జ‌నే ధ్యేయంగా ప‌ని చేశాడా? ఆయ‌న్ని ఈసారి ఓడిస్తామ‌ని సొంత పార్టీ నాయ‌కులే ఎందుకు వ్య‌తిరేకంగా త‌యార‌య్యారు? ఈ క్ర‌మంలో ఆరూరి ర‌మేష్ గ‌త రెండు ద‌ఫాల పొలిటిక‌ల్ గ్రాఫ్‌పై టీఎస్ న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నం.

ప్రస్తుతం రానున్న‌ ఎన్నికల కోసం అన్నిపార్టీలు ఇప్పటికే సర్వేలు మెదలు పెట్టాయి. బీఆర్ఎస్‌ తమ పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు ఆశావహులు,  గెలుపు గుర్రాల వేటలో ప్రైవేట్ సర్వే ఏజెన్సీలతో పాటు సొంతంగా సర్వే చేయించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే పనితీరుపై సీఎం కేసీఆర్ వద్ద ఉన్న రిపోర్టులో ఆరూరి రిపోర్ట్ కార్డు పాజిటివ్ గా ఉందా లేక నెగటివ్ ఉన్నదా? ఒకవేళ‌ నెగటివ్ గా ఉంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అభ్యర్థి ఎవరు? తనకు పోటీగా సత్తా ఉన్న లీడర్ లేకపోవడమే అని రమేష్ భావిస్తున్నారా?

వెలమ సామాజికవర్గ ఆధిపత్యం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల  కోలాహాలం  మొదలైంది. వర్ధన్నపేట నియోజక వర్గం నుంచి ఆరూరి రమేష్ 2014 నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో అధిక ఓట్లతో రెండోసారి గెలిచి వర్ధన్నపేట రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2 లక్షల 24 వేల 760 ఓటర్లున్నారు.  పురుషులు లక్ష 12 వేల 910, స్త్రీ ఓటర్లు లక్షా 11 వేల 850 మంది  ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు అధికంగా ఉన్నారు. పేరుకు ఎస్సీ నియోజకవర్గం  అయినా ఇక్కడ  వెలమ సామాజికవర్గ ఆధిపత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థులకు వారే టికెట్లు ఇప్పించుకొని గెలుపు ఓట‌ములకు వారి మధ్యే పోటీ అన్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ వారు ఎమ్మెల్యేలను సైతం తమ కనుసన్నలలో ఉంచుకోవటం విశేషం.

అభివృద్ధి చేయ‌లేదా?

వరంగల్, హన్మకొండ  నగరాల అర్బన్, సబర్బన్, రూరల్ ప్రాంతాలతో  పర్వతగిరి, వర్ధన్నపేట హాసనపర్తి, హన్మకొండ నాలుగు మండలాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి ఏర్పడి ఉంది. దీంతో  రెండు జిల్లా హెడ్ క్వార్టర్స్ అధికారులు, మంత్రులు, నాయకులతో  నిత్య సంబంధాలు ఏర్పరచుకొని వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో గ్రామాల్లోని రోడ్లు, మౌలిక వసతుల  ఏర్పాటులో అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదనే విమ‌ర్శ‌లున్నాయి. ఎమ్మెల్యే నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంత ప్రజలతో నాయకులతోనే ఎక్కువ సంబంధం కలిగి  ఉంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ మండలాల్లోని గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు  వినిపిస్తోంది.
* పర్వతగిరి మండలంలో ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుల అండతో కొన్ని భూసంబంధమైన వివాదాల్లో తలదూర్చినట్టు వార్తలు పొక్కాయి. ప్రతిపక్షాలు ఆ అంశాల్ని బహిరంగంగానే విమర్శించాయి. వర్ధన్నపేట ఇతర ప్రాంత గ్రామాల్లో మున్సిపాలిటీల్లో, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డులు, పారిశుధ్యం పనులను గాలికొదిలేసినట్లు సమాచారం. వర్ధన్నపేట మున్సిపాలిటీ శానిటేషన్ కార్యక్రమాల్లో, కార్యాలయం వ్యవహారాలు, సిబ్బంది అవసరాలు పారిశుద్ధ్య‌ పనిముట్లు, క్రిమిసంహారక మందులు, ర‌సాయానాల కొనుగోళ్లలో ఎవరి ప్రమేయంతో అవినీతి జరిగిందో అని వర్ధన్నపేట వాస్తవ్యులు బహటంగానే ఆరోపణలు చేసినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేను క‌ల‌వ‌డం క‌ష్ట‌మా?

హరిత హారం, మనబడి వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను చురుకుగా పాల్గొనేలా చేసి అవి విజయవంతం కావడానికి  తోడ్ప‌డ్డాయి. బతుకమ్మ చీరల పంపిణిలో ప్రతియేటా ప్రత్యేక్షంగా పాల్గొని చీరలు పంచిపెడుతూ మహిళా ఓటర్ల కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ మండలాల్లో రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో నమ్మకమైన కొంత మంది అనుచరులు  వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు  నియోజకవర్గంలో క్యాడర్ తన వెంట ఉండేలా చేసిందని చెప్పవచ్చు. నిజానికి నియోజకవర్గంలోని మండలాల్లో ఎమ్మెల్యే అధికార, మంత్రుల ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే  పాల్గొంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే సహాయ సహకారం అవసరమైన సందర్భంలో సన్నిహితులతో వెళితేనే ఎమ్మెల్యేని కలుసుకోవడం కుదురుతుందన్న  అభిప్రాయం వివిధ గ్రామాల ప్రజల్లో నెలకొన్నది. అంతేకాదు ఎమ్మెల్యే తీరు వర్ధన్నపేట పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్ విద్యాలయాల యాజమాన్యంతో  సన్నిహితంగా ఉంటూ హన్మకొండ, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో దోస్తానా చేస్తూ, నిర్మాణ రంగ ప్రముఖులకు అండగా ఉంటున్నట్లు నియోజకవర్గంలో ప్ర‌చారంలో ఉంది.

మైన‌స్ పాయింట్లు?

నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లో రైతులు ఎమ్మెలే పనులను అక్షేపించిన తీరు అంతా  గమనించిందే. రైతులు ఎమ్మెల్యేని ఎన్నిసార్లు కలిసి తమ భూములను కాపాడమని తమ గోడును వినిపించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నట్లు సమాచారం. దానికి సంబంధించి ఎమ్మెల్యేను రైతులు ప్రత్యక్షంగా నిలదీసిన సందర్భాలు మీడియాలో కనిపించినవే. ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని పలు విషయాలు వివాదాస్పదం కావడం, ఎమ్మెల్యే తనయుడు అంతా తానే అన్నట్లు కనబడుతుండటం రమేష్ కు మైనస్ పాయింటే. దానికి తోడు బీఆర్ఎస్ సొంతపార్టీ  మునిసిపల్ కౌన్సిలర్స్, లోకల్ నేతలు, తన సన్నిహితులే ఆరూరి రమేష్ కు ఈసారి  వర్ధన్నపేట టికెట్ ఇవ్వొద్దని..  ఇస్తే ఓడిస్తామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ప్రముఖులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఛైర్మన్ కి వినతి పత్రం అందజేసిన విష‌యం తెలిసిందే.
* రెండో విడత పదవి ముగుస్తున్నదశలో ప్రస్తుతం గ్రామ, మండల స్థాయి నాయకుల కుటుంబాల్లో చావు, పుట్టుకలు, పెళ్లి, విందు, వినోదాలకు హాజరవుతూ ఉండటం చూస్తే క్యాడర్ పై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమౌతుంది. అయితే మండలాల్లో, పలు గ్రామాల్లో ఇచ్చిన హామీలు, సీసీ రోడ్ల‌ పరిస్థితి అంతంత మాత్రమే. వర్ధన్నపేట  ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా మారుతుందన్నది హామీగానే మిగిలిపోయింది. వంగపహాడు గ్రామంలో  కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి పూర్తి చేయించారు.
* తన తండ్రి పేరున ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాల్ని అందిస్తున్నారు. తన ఘట్టుమల్లు ఫౌండేషన్ తరపున మొన్నటి పోలీస్ రిక్రూట్మెంట్లో వంద‌ మంది నియోజకవర్గ నిరుద్యోగులకు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్ ఇప్పించి  ఆయా గ్రామాల ప్రజల మెప్పు పొందారనుకోవచ్చు. గతంలో మారుమూల గ్రామాల నుంచి వర్ధన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కు వచ్చి చదువుకుంటున్న పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో భోజనాలు పెట్టించిన సందర్భం హర్షణీయం.

కాంగ్రెస్ ఎలా చెక్ పెడుతుంది?

నిజానికి ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైన ఎలాంటి  అభిప్రాయం ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటాడా? ప్రతిపక్ష పార్టీలు సందిస్తున్న ప్రశ్నల్లో సరి అయినవేనా? పార్టీ హామీలు ఎంతవరకు నెరవేరాయన్న అంశంతో బాటు ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టనున్న‌ అభ్యర్థుల వివరాలు, బలాబలాలను ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వం బేరీజు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్న క్రమంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీయే గట్టి పోటీ అన్న విషయం తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నమ్మిండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఇటీవల నిజామాబాద్ జిల్లా నుంచి పోలీస్ కమిషనర్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికరమైన  అంశం ఏమిటంటే ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని  వరదన్నపేట నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి  ప్రోత్సహిస్తున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. రేవంత్ కూడా సీతక్కకు పార్టీలో ప్రాముఖ్యత నివ్వడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రానున్న‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాను నియోజకవర్గానికి  చేసిన కృషిని బట్టి పార్టీ అధినాయ‌కుడు కేసీఆర్, నియోజకవర్గ ప్రజలు తన భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని ఎలా ఆవిష్కరిస్తారో త్వరలోనే  తెలుస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com