Thursday, December 26, 2024

10 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్‌లలో నీటి ఎద్దడి….

  • మరో 67 పట్టణాల్లోనూ ప్రతిరోజూ 100 ఎల్పీసిడిల కంటే తక్కువ నీటి సరఫరా
  • ప్రభుత్వానికి అందిన నివేదిక
  • సమస్యను పరిష్కరించడానికి ప్రతిరోజు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సమీక్ష
  • అదనపు నిధులను కేటాయించిన ప్రభుత్వం
  • జూన్ వరకు తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు
  • రూ.200 కోట్ల కేటాయింపు

తాగునీటి సమస్య తీవ్రతను గుర్తించిన సిఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికపైన తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో అన్ని మున్సిపాలిటీల్లో నీటి సమస్య ఏర్పడకుండా పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తాగునీటి సమస్య ఎద్దడి నివారణ కోసం సచివాలయంలో ప్రతిరోజూ అధికారులు సమీక్ష చేస్తున్నారు. దీనికోసం రూ.200 కోట్ల నిధులను కేటాయించినట్టు అధికారులు పేర్కొంటుండగా ఈ సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల కలెక్టర్‌లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, ఖమ్మం రెండు కార్పొరేషన్ల పరిధిలోనే ఎక్కువగా నీటి కొరత ఉందని ప్రభుత్వానికి అందిన నివేదికలో తేలింది.

దీంతో వీటిపై అధికారులు దృష్టి సారించినట్టుగా సమాచారం. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా తలసరి నీటి అవసరాన్ని పరిశీలిస్తే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్పీసిడి (లీటర్స్ పర్ పర్సన్ పర్ డే) కంటే ఎక్కువ నీటి సరఫరా ఉంది. 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసిడిల మధ్య తాగునీటి సరఫరా జరుగుతోంది. 100 ఎల్పీసిడిల కంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలు సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఎండాకాలానికి సరిపడా ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి కొరతరాకుండా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లకు సిఎస్ ఆదేశించడం, ప్రతిరోజు సచివాలయం నుంచి కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్‌లతో ఉన్నతాధికారులు నీటి ఎద్దడి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.

Water shortage in hyderabad city

నిరంతరం తాగునీటి ఎద్దడిపై సమీక్ష
రాష్ట్రంలో నీటి కొరత రావద్దని ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించిన సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నీటి కొరత ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు నిరంతరం తాగునీటి ఎద్దడిపై సమీక్ష జరుపుతున్నారు. అందులో భాగంగా నారాయణపుర డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం అవసరమైన నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఎగువ రాష్ట్రాలపై మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు తగినంత వరద నీరు రాలేదు. ఈ రిజర్వాయర్లు నిండలేదు. దీంతో ఈ ఏడాది సాగునీటికి నీరు అందకపోగా, బోరుబావులు సైతం ఎండిపోయాయి.

ఉదయ సముద్రం రిజర్వాయర్ల ద్వారా నల్గొండ, ఖమ్మం పట్టణాలకు…
పట్టణాలు, గ్రామాలకు సమీపంలో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఇప్పటికే అన్ని మున్సిపల్, కార్పొరేషన్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు గోదావరి, ఇటు కృష్ణా పరిధిలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల ద్వారా నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా మిడ్ మానేర్, ఎల్ ఎండి నుంచి కరీంనగర్ పట్టణానికి సరిపడా నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్ కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథ కు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

130 పట్టణల్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేదు….
అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని గ్రామాలు, పట్టాణాల నుంచి నీటి సమస్యపై విజ్ఞప్తులు భారీగా వస్తుండడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన అధికారులు జూన్ వరకు తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. వేసవిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు పది మంది సీనియర్ ఐఏఎస్ లను ప్రత్యేక అధికారులుగా నియమించించింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే మొత్తం 142 పట్టణాలు ఉండగా అందులో 130 మున్సిపాలిటీలున్నాయి. వీటితో పాటు 12 కార్పొరేషన్లు ఉండగా ఇందులో 130 పట్టణల్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేదని, సాధారణ రోజులతో పోలిస్తే కేవలం పది శాతంలోపు తాగునీటి సరఫరా తగ్గినప్పటికీ ప్రజల అవసరాలకు సరిపడా నీటిని అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

Water shortage in hyderabad city

రాష్ట్రవ్యాప్తంగా 26.31 ఎంఎల్డీల నీటి కొరత మాత్రమే….
సాధారణ రోజుల్లో సగటున రోజుకు 1398.05 ఎంఎల్డీల (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) తాగునీటి సరఫరా జరుగుతుండగా, ప్రస్తుతం 1371 ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తాగునీటికి సంబంధించి కేవలం రాష్ట్రవ్యాప్తంగా 26.31 ఎంఎల్డీల నీటి కొరత మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా10 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, ఖమ్మం రెండు కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి కొరత ఎక్కువగా ఉందని అధికారుల నివేదికలో తేలింది ఎండలు పెరిగిన కొద్దీ ఈ రెండు పట్టణాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది.

23,839 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 23,839 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కడా తాగునీటి ఎద్దడి లేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో 100 ఎల్‌పీసిడి నీటి సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రిడ్ పంప్‌లతో పాటు స్టాండ్ బైగా పంపులను అందుబాటులో ఉంచారు. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ.100 కోట్ల నిధులు విడుదల చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com