- బిసి నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం
- వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్
రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, బిసి నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడితే బిజెపి నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాలంటే బిజెపికి చిన్న చూపు అని, బిసిలు రాజకీయంగా ఎదగడం బిజెపి నేతలకు ఇష్టం లేదని ఆయన అన్నారు. బిసి నేతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి రెడ్డి వర్గానికి అప్పగించిన చరిత్ర బిజెపిదని ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రచారం చేసుకున్న చరిత్ర బిజెపిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి బిసి వ్యతిరేకి కాబట్టే ప్రజలెవ్వరూ ఆ పార్టీకి ఓటు వేయలేదన్నారు.
బిజెపి వైఫల్యాలను ఎత్తి చూపిస్తే మా మంత్రి పొన్నంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. బిజెపి నేతలకు దమ్ముంటే తెలంగాణకు పదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పార్టీలో పని చేసి మంత్రి స్థాయికి ఎదిగిన చరిత్ర పొన్నం ప్రభాకర్‌ది ఆయన అన్నారు. పదేళ్ల పాటు బిఆర్‌ఎస్ వైఫల్యాలపైన పొన్నం ప్రభాకర్ అనేక పోరాటాలు చేశారన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రజలు నమ్మినందునే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలను జనం బండకేసి కొట్టారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కూడా కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల బిజెపికి డిపాజిట్లు రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా సగం సీట్ల లో బిజెపికి డిపాజిట్లు రావన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేదన్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలవడం బిజెపి అగ్ర నాయకులకే ఇష్టం లేదన్నారు.