ఉద్యోగులకు భద్రత కల్పించాలని సిఎస్‌కు వినతి
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. నిర్మల్ ఆర్డీఓ రత్నకల్యాణి పట్ల ఆందోళనకారులు వ్యవహారించిన తీరు బాధాకరమన్నారు. ఆర్డీఓ కారుపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమె అనారోగ్యంతో ఉందని కూడా చూడకుండా కారులోనే నిర్బంధించడంపై ఆయన మండిపడ్డారు. నిన్న లగచర్ల, నేడు దిలావర్‌పూర్‌లో రెవెన్యూ అధికారుల పట్ల ఆందోళనకారులు వ్యవహారించిన తీరు సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ఉద్యోగులు పని చేసే వాతావరణం ఉండదన్నారు. పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకొని బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులంతా జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఈ మేరకు బుధవారం చీఫ్ సెక్రటరీ శాంతకుమారికి వినతిపత్రం సమర్పించామని ఆయన తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ఆందోళనకారులు వ్యవహారిస్తున్న తీరు భయాందోళనకరంగా ఉందన్నారు. ఏ సమస్య ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా, మౌఖికంగా చెప్పుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధ, కోశాధికారి శ్రీనివాస్ శంకర్‌లు పాల్గొన్నారు.
మహిళా ఆర్డీఓను నిర్బంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి: ట్రెసా
లగిచర్ల ఘటన మరువకముందే దిలావర్‌పూర్ ఘటన బాధాకరమని, మహిళా ఆర్డీఓను నిర్బంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌లు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నిర్మల్ ఆర్డీఓను నిర్భదించడం దారుణమన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి 9 గంటలకు వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి రావడం ఇబ్బందికరమన్నారు.
రాత్రి 10 గంటల వరకు నిరసనకారుల నిర్బంధంలో ఉన్న ఆర్డీఓను విడిపించేందుకు పోలీసులు వలయంగా ఏర్పడి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో ఆందోళనకారులు ఆర్డీఓ కారును ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు అతి కష్టంమ్మీద ఆర్డీఓను పోలీసు వాహనంలో నిర్మల్‌కు తరలించే పరిస్థితి రావడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజలు తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.