పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గురువారం లేబర్ కాలనీ, చెరువు సెంటర్, రాజరాజేశ్వరి పేట, తదితర ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని అధైర్య పడోద్దని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో బాధితులకు శరవేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బాధితుల జీవనస్థితిగతులను మెరుగుపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
ప్రతిపక్ష హోదా కుడా లేని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మంగళవారం 44 వ డివిజన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన టిడిపి కార్యకర్త కిలాని దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించారు. వరద సహాయక చర్యల్లో సాయం అందిస్తున్న దుర్గారావు గుండెపోటుతో మరణించడం బాధాకరమని కూటమి ప్రభుత్వం బాధితుని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుజనా వెంట కూటమినేతలు నాగుల్ మీర, మైలవరపు దుర్గారావు, తిరుపతి అనూష, బొడ్డుపల్లి శ్రీనివాస్, బోగవల్లి శ్రీధర్, మణికంఠ లోకేష్, ఈశ్వర్ యాదవ్, రౌతు వాసు, తెలకుల సుబ్బారావు, నున్న కృష్ణ, షేక్ రజీనా కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.