భారత్ లో అన్ని రాష్ట్రాల్లో ఈ యేడాది భారీ వర్షాలు కురిశాయి. జులై నుంచి మొదలైన వానలు సెప్టెంబర్ ప్రారంభం తరువాత కూడా కురుస్తూనే ఉన్నాయి. దేశంలో ఈ వర్షాలు అక్టోబర్ మొత్తం వరకు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. లా నినా ప్రారంభంతో సెప్టెంబర్ తో పాటు అక్టోబర్ నెలలో సైతం వర్షాలు కురుస్తాయని ఐఎండి స్పష్టం చేసింది. మామూలుగా వర్షాకాలం చివరిలో సంభవించే లా నినా ఉష్ణోగ్రతలో తీవ్ర తగ్గుదలని కలిగిస్తుంది. దీంతో వర్షపాతం పెరిగడంతో పాటు రానున్న రోజుల్లో తీవ్రమైన చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ మాసంలో ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, లా నినా ప్రభావంతో అక్టోబర్ లో కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండి పేర్కొంది.
లా నినా కారణంగా రుతుపవనాలు సెప్టెంబర్‌లో తిరిగి వచ్చే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. లా నినా కారణంగా బంగాళాఖాతంలో బలమైన వాయుగుండం ప్రభావం ఉండవచ్చని.. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు భారత వాతావరణ శాఖ అధికారులు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో చిన్న మార్పులు వాతావరణంలో పెను మార్పులకు ఎలా కారణమవుతున్నాయో.. ఎల్ నినో, లా నినా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాను మార్చగలవని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఐతే లా నినా సమయంలో ఇది సాధారణం కంటే చలిగా మారి.. సముద్ర ఉపరితలం వేగంగా చల్లబడుతుంది. అందుకే ఈసారి చలి మరింత ఎక్కవగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.