చంద్రబాబు, రేవంత్ భేటీతో సమస్యలకు పరిష్కారం
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. అందులో ప్రధానంగా వివిధ కార్పొరేషన్లు, పలు సంస్థల విభజన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తావిస్తోంది. 2014లో రాష్ట్ర విభజన టైంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్టీకరణ చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని పలు అంశాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా, ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 ముఖ్యమైన కార్పొరేషన్లపై తెలంగాణ, ఆంధఅరప్రదేశ్ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
ఏపీ పునర్విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భిన్న వాదనలు ఉన్నాయి. సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ చెబుతుండగా, హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ కు చెందిన అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా, ఏపీ దీనికి ససేమిరా అంటూ వస్తోంది. ఇక విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ లో మొత్తం 142 సంస్థలు ఉండగా, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని, ఐతే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో స్పష్టం చేశారు. దీనికి సంబందించి కేంద్ర హోంశాఖ పలుసార్లు సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ ఉపనిచేసిన టైంలో మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసి కూడా ఈ అంశాలపై చర్చించారు. అయినా కొన్ని అంశాల్లో రెండు రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
మరోవైపు రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ చెబుతోంది. అంతే కాకుండా కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు తదితర బకాయిలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఐతే దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
చాలా రోజుల తరువాత పెండింగ్ విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఈక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విభజన అంశాలపై చర్చించేందుకు ఈనెల 6న హైదరాబాద్ లో సమావేశం అవుదామని చంద్రబాబు ప్రతిపాదించగా రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.