కల్నల్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై సుప్రీం ఫైర్
ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని నిలదీసింది. కర్నల్ సోఫియాపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా తక్షణమే విచారణ చేపట్టాలని మంత్రి తరఫు న్యాయవాది సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ తరహా ప్రకటనలు చేయడం ఏంటని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని మంత్రి తరఫు న్యాయవాది అభ్యర్థించగా శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.