- కాళేశ్వరం పేరుతో కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనం అయ్యింది
- హరీశ్ రావు తన అనుభవాన్ని చెప్పాలి తప్ప రాజకీయం చేయవద్దు
- బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మల్లన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి పంపు చేసినవే తప్ప అందులో కాళేశ్వరం నీళ్లు లేవని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిపుణుల సూచన మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గేట్లు తెరిచే ఉంచామని అందువల్ల అక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే అవకాశం లేదన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కొట్టుకుపోతే ఈ నీళ్లెక్కడివి అంటూ బిఆర్ఎస్ నేతలతో కలిసి హరీశ్ రావు శుక్రవారం మల్లన్నసాగర్‌ను సందర్శించి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. మల్లన్న సాగర్‌లో ఉన్న నీళ్లకు కాళేశ్వరంకు ఏం సంబంధం అని మంత్రి ప్రశ్నించారు.
ప్రతిపక్షం గుడ్డిగా మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నం అన్నారు. కాళేశ్వరం పేరుతో కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనం అయ్యిందని, ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు బిఆర్ఎస్ నేతలు మల్లన్న సాగర్ వద్ద షో చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇకనైనా బిఆర్ఎస్ నేతలు కాళేశ్వరం విషయంలో ఇటువంటి పనులు మానుకొని తప్పు అంగీకరించాలన్నారు. కాళేశ్వరం విషయంలో రాజకీయాల కంటే రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ పనిచేస్తుందని, అందువల్లే ఎల్లంపల్లి నుంచి దాని కింద ఉన్న మిగతా జలాశయాలను నింపుకోగలిగామన్నారు. తమ ప్రభుత్వంపై భగవంతుడి కటాక్షం కూడా ఉందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు తన అనుభవాన్ని చెబితే చెప్పాలి తప్ప రాజకీయం చేయవద్దని మంత్రి పొన్నం కోరారు.
2009 నుంచి 2014ల మధ్య ఎల్లంపల్లి పూర్తి
2009- నుంచి 14లో తాను ఎంపిగా ఉన్న సమయంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయ్యిందని పొన్నం చెప్పారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తానని నాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తెలంగాణ వ్యతిరేకివి నువ్వు ఎలా వస్తావ్ వస్తే హెలికాప్టర్ పేల్చేస్తానని తాను హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే అప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయ్యిందన్న విషయాన్ని బిఆర్ఎస్ గుర్తుంచుకోవా లన్నారు. మిడ్‌మానేరు నుంచి వరంగల్ వరకు రిజర్వాయర్లు నింపింది ఎల్లంపల్లి నుంచే అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రాణహిత ప్రాజెక్ట్‌లో ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీ బ్యారేజీ, మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు ఉన్నాయన్నారు. ఇంజనీర్ కాకున్నా అప్పటి ముఖ్యమంత్రి రీడిజైన్ పేరుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారు అధికారంలో ఉండగానే కుప్పకూలిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. తాము అధికారంలోకి (డిసెంబర్) నాటికి అక్టోబర్, నవంబర్లోనే కాళేశ్వరం కుంగిపోయిందని, ఇది విద్రోహ కుట్ర ఉందని మీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెరిచే ఉంచామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రీడిజైన్ పేరు మీద మూడు ఎత్తిపోతలు పెట్టి తమ్మిడిహట్టిని మార్చివేశారని ఆయన విమర్శించారు. తమ్మిడి హాట్టితో పాటు తెలంగాణలో మిగతా ప్రాజెక్టుల పనులు ప్రారంభించుకొని పెండింగ్‌లో ఉన్న అన్నింటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కు రూ.431 కోట్లు కేటాయించామని, ఎస్ఎల్ బిసి సొరంగం పనులు కూడా రెండు రోజుల క్రితం మంత్రుల బృందం పరిశీలించిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు పూర్తి చేసినంత మాత్రాన వాటిని కెసిఆర్ పూర్తి చేసినట్లు కాదన్నారు