Sunday, November 17, 2024

Hyderabad Press Club Elections ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎప్పడు?

  • నాయుడూ.. ర‌వికాంత్‌.. కుర్చీ దిగరా..?
  • గ‌డువు ముగిసినా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌రా?
  • మళ్లీ పదవుల్లోకి వచ్చేందుకు కుట్రలు
  • రిటైరైన నాయుడు, డెస్క్‌లో ఏడాది ఎక్స్‌టెన్ష‌న్‌
  • తాజాగా హైడ్రాలో పీఆర్‌వోగా చేరిక‌

చెప్పేవీ శ్రీరంనీతులు.. వెళ్లేవి…!! అన్నట్టుగా ఉంది హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​ కార్యవర్గం పరిస్థితి. పదవీకాలం ముగిసినా.. ఏవో కారణాలను అడ్డు పెట్టుకుని దిగిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రెస్​ క్లబ్​లో రాజభోగాలు అనుభవిస్తూ.. సభ్యులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జర‌గాల్సి ఉండగా.. కుర్చీలను వీడేందుకు పలు కారణాలను వెతుకుతున్నారు. దిగిపొండి.. మహా ప్రభూ అంటూ మూకుమ్మడిగా స‌భ్యులు చెబుతున్నా.. ఇంకా ప్రెస్ క్ల‌బ్ అధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. పని చేసే సంస్థలో ఉద్యోగాలు గాలిలో దీపంగా మారడంతో.. ఇప్పుడు ప్రెస్​క్లబ్​ను అండగా.. దాన్ని వాళ్ల అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు.

హైదరాబాద్​ప్రెస్​క్లబ్​కు 2022 మార్చి 19న ఎన్నిక‌లు జ‌రిగాయి. కార్యద‌ర్శిగా ర‌వికాంత్ రెడ్డి (ది హిందూ), అధ్యక్షుడిగా వేణుగోపాల్ నాయుడు (ఈనాడు) ఎన్నిక‌య్యారు. అదే సమయంలో ఎన్నికల్లో ఏవేవో కుట్రలు చేశారంటూ ఒక వర్గం కోర్టుకెక్కింది. ఈ కోర్టు కేసు కార‌ణంగా నూత‌న క‌మిటీ బాధ్యత‌ల స్వీక‌ర‌ణ‌కు మూడు నెల‌ల ఆల‌స్యమైంది. ఆ తర్వాత కొత్త పాలకర్గం కొలువుదీరింది. ఏవేవో చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చిన కొత్త కార్యవర్గం వాళ్ల పరపతి, అవసరాల మేరకే పని చేస్తూ వ‌చ్చిందే తప్ప.. కొత్తగా అభివృద్ధి చేసింది పెద్ద‌గా ఏమీ లేదు. ఈ లెక్కన 2024 మార్చి 19 నాటికి కార్యవ‌ర్గం ప‌ద‌వీకాలం ముగిసింది. కోర్టు కేసు కార‌ణంగా న‌ష్టపోయిన మూడు నెల‌లు క‌లుపుకున్నా.. జూన్ 19 నాటికి ప‌ద‌వీ కాలం పూర్తవుతుంది. కానీ, ఇప్పుడు అక్టోబర్​ 19 వ‌స్తున్నా.. ర‌వికాంత్ రెడ్డి, వేణుగోపాల్ నాయుడు టీం ప్రెస్​క్లబ్​ కుర్చీల‌ను వీడ‌టం లేదు. మూడు నెల‌ల‌కు బ‌దులుగా.. ఇంకా అక్రమంగా ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు.

ఇవేనా మీ విలువలు
ప్రెస్​క్లబ్​ ఎన్నికల నిర్వహణే ఒక అభూత కల్పన. కొన్ని సంస్థలకు చెందిన వారికే ముందుగా మెంబర్​షిప్​ఇచ్చుకున్నారు. దీంతో ఆ కొంతమంది మాత్రమే ప్రతిసారి ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత ప్రెస్​క్లబ్​లో ఆంధ్రా పెత్తనం తగ్గుతుందని ఆశపడ్డారు. కానీ, ఇప్పటికీ వాళ్లదే పెద్ద పాత్రగా మారింది. మెంబర్లు కూడా మా సంస్థకు చెందినవారే ఎక్కువ ఉన్నారంటూ ఆధిపత్య ధోరణని కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇక, విలువలు, ప్రమాణాల గురించి గొప్పలు చెప్పుకునే ఈనాడు, ది హిందూ సంస్థల్లో ఉద్యోగాలు వెలగబెడుతున్న నాయుడు ర‌వికాంత్ ల అక్రమాలు సదరు సంస్థలకు కనిపించడం లేదా అనే ఒక ప్రశ్న ప్రెస్​క్లబ్​ సభ్యులను తొలిచి వేస్తుంది. ప‌ద‌వీ కాలం పూర్తయిన త‌ర్వాత ఇంకెన్ని రోజులు కార్యవ‌ర్గం కొన‌సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణంతో ఎన్నికలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి, అధ్యక్షుడు నాయుడు ఇటీవల ఈనాడులో రిటైరయ్యారు. ఒక ఏడాది కాంట్రాక్ట్​ పద్దతిలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈనాడులో ఉద్యోగం లేకపోవడం.. పైగా ఇటీవ‌ల హైడ్రాకు పీఆర్‌వోగా ఎన్నికై.. ప్రెస్​క్లబ్​ను త‌న అవసరాలకు వేదిగా మార్చుకున్నాడు. ఇక్కడ ఎంత ఆదాయం వస్తుందో.. అందుకే ప్రెస్​క్లబ్​ను వీడటం లేదనే విమర్శలు జోరుగా వస్తున్నాయి. హైడ్రా ప‌ట్ల మీడియాలో పూర్తి స్థాయి వ్య‌తిరేక‌త ఉండ‌టంతో.. మీడియాను కంట్రోల్ చేసే బాధ్య‌త‌ను నాయుడు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ప్రెస్ క్ల‌బ్ ప‌ద‌విని అడ్డం పెట్టుకుంటున్నాడ‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

మేం దిగిపోం.. మళ్లీ వస్తాం
ఈనాడులో ప‌ద‌వీ కాలం ముగిసిన వేణుగోపాల్ నాయుడు ఈసారి కార్యద‌ర్శి ప‌ద‌వికి పోటీ చేయాల‌ని భావిస్తున్నాడని ఒక చర్చ. అందుకే ఇప్పటి నుంచే ఒక వర్గాన్ని సభ్యుల్లో ప్రచారానికి కూడా దింపాడు. ఈనాడు పాటించే విలువ‌ల ప్రకారం ప్రెస్ క్లబ్ ఎన్నిక‌ల్లో ఈనాడు త‌ర‌ఫున అత‌ను పోటీ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అత‌నికి రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వలేదు. ఏడాదికి మాత్రమే ఇచ్చారు. అలాంట‌ప్పుడు రెండేళ్ల ప‌ద‌వీ కాలంతో ఉండే ప్రెస్‌క్లబ్‌లో అత‌ను పోటీ చేయ‌డానికి వీల్లేదు. కానీ, ఇవన్నీ ఎక్కడా బయటకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. మళ్లీ పదవిలోకి రావాలనే ప్లాన్​లు వేస్తున్నాడు. తమ సంస్థలోనే ఎక్కువ సభ్యులు ఉన్నారని, తమ వర్గానికి కూడా ఎక్కువ ఓట్లు ఉన్నాయనే ధీమాతో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నాడు. పైగా హైడ్రా పీఆర్‌వోగా కొత్త ఉద్యోగంలో చేర‌డంతో.. అత‌ను ప్రెస్ క్ల‌బ్ రెగ్యుల‌ర్ మెంబ‌ర్ బ‌దులు అసోసియేట్ మెంబ‌ర్‌గా అవుతాడ‌ని ప‌లువురు స‌భ్యులు అంటున్నారు. అలాంట‌ప్పుడు, మ‌ళ్లీ ఎలా పోటీ చేస్తాడ‌ని కొంద‌రు స‌భ్యులు ప్ర‌శ్నిస్తున్నారు.

మరోవైపు ప్రధాన కార్యదర్శి ర‌వికాంత్ రెడ్డికి ఇప్పటికే ప‌లు పదవుల్లో ఉన్నాడు. ప్రెస్ క్లబ్ కార్యద‌ర్శిగా, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సొసైటీకి ఉపాధ్యక్షుడిగా సైతం ఉన్నాడు. ఇవన్నీ పదవుల్లో ఉన్నప్పటికీ.. ఒక వర్గానికి మాత్రమే అండగా ఉంటున్నాడనే వ్యతిరేకత ఉంది. ఇతర సభ్యులు, మీడియాకు సంబంధించిన వారి వ్యవహారంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడని గతంలో చాలా మంది గొడవకు దిగారు. ది హిందూ వంటి బాధ్యతాయుత‌మైన ప‌త్రిక‌లో ప‌ని చేస్తూ విలువలు పాటించ‌క‌పోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

గెంటేసేదాకా వెళ్లరా..!
మీడియా సర్కిళ్లలో ఇప్పుడు ప్రెస్​క్లబ్​ కార్యవర్గం అంశం చర్చగా మారింది. ఇప్పుడున్న కార్యవర్గం పలు కారణాలతో కాలయాపన చేస్తూ దిగిపోవాల్సిన కుర్చీల్లో కూర్చుండి ఎంజాయ్​ చేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఈ లెక్కన నాయుడు, రవికాంత్​రెడ్డిని ప‌ద‌వుల నుంచి గెంటేసే దాకా కుర్చీ వ‌ద‌ల‌రా అనేది ఇప్పుడు మెంబర్లలో టాక్​.

రాజ్యాంగాన్ని మారుద్దామా..?
ప్రెస్ క్లబ్​ రాజ్యాంగంపై దిగిపోవాల్సిన కమిటీ దృష్టి పడింది. తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. ర‌వికాంత్‌, నాయుడుతో క‌లిసి కొంద‌రు స‌భ్యులు ప్రెస్ క్లబ్ రాజ్యాంగాన్ని మార్చే ప‌నిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప‌ద‌వీ కాలం పూర్తయిన క‌మిటీ ఎస్ జీఎంకు ఎలా నోటీసు ఇస్తుంది? ఎస్ జీఎం ఎలా నిర్వహిస్తుందనేది చిక్కు ప్రశ్నే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular