కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవనితి జరిగిదంటూ దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, మెగా కృష్ణా రెడ్డి, మిగిలిన ప్రతివాదులకు భూపాలపల్లి జిల్లా కోర్ట్ నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా విచారణకు రావాల్సిందిగా జూలై 10, 2024 నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి కోర్టు. కింది కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని కేసీఆర్ తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడు రాజలింగమూర్తి చనిపోయాడు కాబట్టి కింది కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ఎత్తివేయాలని కేసీఆర్ తరుపు న్యాయవాది కోరారు. ఫిర్యాదుదారుడు హత్యకు గురైనట్లు న్యూస్‌లో చూశామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారుడు చనిపోయిన తరువాత కేసు విచారణ అర్హత ఉండదు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఫిర్యాదుదారుడు చనిపోయినా కూడా కేసును కొనసాగించవచ్చని పీపీ వాదనలు వినిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కేసు వ్యవహారంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి కోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌ను కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో భూపాలపల్లి కోర్ట్‌లో హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ప్రైవేటు పిటిషన్ చేశారు.
ఇందులో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, కొంత గడువు ఇస్తే సుప్రీంకోర్టు జెడ్జిమెంట్‌ను న్యాయస్థానం ముందు పెడతామని పీపీ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణలో ఇరువరి వాదనలు విన్న తరువాత కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేదానిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.