తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పై దాడికి యత్నించిన కేసులో భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 2023లో తెలుగు సంతతి యువకుడు సాయి వర్షిత్ ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడికి యత్నించాడని తెలిసిందే. దాడి కేసులో పోలీసులు గతంలోనే సాయి వర్షిత్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా కేసు మరోసారి విచారణకు రాగా, నిందితుడు సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. నాజీ భావజాలంతో వెళ్లిన నిందితుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని జడ్జి జస్టిస్ డాబ్నీ ఫ్రెడ్రిచ్ వెల్లడించారు.
అవకాశం దొరికితే అధ్యక్షుడ్ని హత్య చేయాలని ప్లాన్
ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో భారత సంతతికి చెందిన యువకుడు సాయివర్షిత్ వైట్ హౌస్ పై దాడికి యత్నించాడు. అవకాశం దొరికతే అధ్యక్షుడిని కూడా హత్య చేయాలన్న ఆలోచనతో అతడు ట్రక్కుతో అధ్యక్ష భవనం వైపు దూసుకొచ్చాడు. అన్ని విషయాలను పరిశీలించిన అనంతరం జడ్జి సాయివర్షిత్‌కు ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించాడు. దాడి సమయంలో ట్రక్కుతో అతడు ఢీకొట్టి కూల్చేసిన నిర్మాణాలకు భారత కరెన్సీలో దాదాపు రూ.3,74,000 మేర నష్టం వాటిల్లినట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చెప్పారు. సాయి వర్షిత్ కందుల 2023 మే 22 మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చాడు. ముందుగానే దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్న సాయి వర్షిత్ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి తొమ్మిదన్నర గంటలకు వైట్ హౌస్ వైపు వాహనాన్ని నడిపాడు. వైట్‌హౌస్ సెక్యూరిటీ కోసం ఏర్పాటుచేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొడుతూ ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్రక్కు దిగిన అతడు నాజీ జెండాతో నినాదాలు చేయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.