ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు తాజాగా చేరారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, నేతి విద్యాసాగర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆకుల లలిత, నీలం మధు ముదిరాజ్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్లను మంజూరు చేస్తే.. వీరిలో ఎంతమంది గెలుస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేవలం సీటు కోసం కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన.. వీరిలో ఎంతమందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మట్టి కరిపించే సత్తా ఉంది? ఎంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటాపోటీగా ఖర్చు పెడతారా? తదితర అంశాలపై ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు వ్యక్తుల్లో ఇద్దరు, ముగ్గురికి తప్ప గెలిచే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉన్నంత మాత్రాన.. అందులో ఎంతమందికి గెలిచే సత్తా ఉందనే అంశాన్ని విశ్లేషించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది.