హస్తిన సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరనే సస్పెన్స్ కి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అనుభవం.. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం ఆమె ఎంతగానో కృషిచేశారు. రేఖా గుప్తాకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయకపోయినప్పటికీ ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా రేఖా గుప్తా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా.. ఆ తర్వాత మేయర్‌గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
సంఘ్ నేపధ్యం
రేఖాగుప్తాను సీఎంగా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం కూడా బాగా కలిసొచ్చింది అని చెబుతున్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం రేఖా గుప్తా వయస్సు 50 ఏళ్లు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పని చేశారు. రేఖ కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. 1995-96లో ఆమె ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. తన చదువు పూర్తయిన తర్వాత 2003-04లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. తాజాగా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేసులో మొదట్నుంచీ పోటీ పడిన పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు.