రాష్ట్రంలో హెచ్‌సీయూ భూముల వివాదం రాజకీయాలను షేక్ చేసింది. అయితే, ఈ వివాదంలో మాజీ మంత్రి కేటీఆర్ ఓ బాంబు పేల్చారు. ఈ వ్యవహారం మొత్తం మీద భారీ భూ కుంభకోణం జరుగుతుందని, దానిలో బీజేపీకి చెందిన ఓ ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారని, సీఎంకు వెనక ఉన్నది ఆయనేనని ఆరోపించారు. అంతేకాదు.. బ్రోకరేజ్ కింద ఓ కంపెనీకి రూ. 170 కోట్లు సదరు ఎంపీ ఇప్పించారని చెప్పుకొచ్చారు.
దీంతో ఇప్పుడు భూ వివాదం పక్కన పెడితే.. ఇంతలా చక్రం తిప్పుతున్న ఆ ఎంపీ ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండగా.. వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీకి జాతీయ స్థాయిలో కీలక సంబంధాలు ఉన్నవారే. ఇక, మరో ఎంపీ ఈటల రాజేందర్. ఆయనపై ఇప్పటికే భూ కబ్జాల ఆరోపణలున్నాయి. అదే కారణాన్ని చూపిస్తూ గులాబీ పార్టీ.. అప్పుడు కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది. ఇక, మిగిలిన వారిలో రఘునందన్‌రావు, అరవింద్, డీకే అరుణ కొంత స్ట్రాంగ్ ఎంపీలే. దీంతో ఈ భూముల వ్యవహారంలో సీఎం వెనక ఉన్న ఎంపీ ఎవరనేది ఉత్కంఠగా మారింది.
కేటీఆర్ ఆరోపణల ఏంటీ..?
రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన హెచ్‌ఎండీఏ భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు. కంచ బౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందని, ఈ 400 ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఆధారంగానే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకరేజ్ కంపెనీని తీసుకొచ్చి ఈ వ్యవహారం సాగిస్తునన్నారని, ఎఫ్ ఆర్ బి ఎం ను బైపాస్ చేసి డబ్బులు తీసుకొస్తామని చెప్పి అందుకు కమిషన్ ఇవ్వాలని ఆ కంపెనీ కోరిందని, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 170 కోట్లు లంచం ఇచ్చిందని కేటీఆర్ ఆరోపణ. ఆ తరువాత బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని ముందట పెట్టి మోసానికి పాల్పడ్డారని, ఓ బీజేపీ ఎంపీ ఇదంతా చేశారని అంటున్నారు. తనకు అండగా ఉన్న బీజేపీ ఎంపీకి సీఎం లబ్ధి చేకూరుస్తున్నారని, త్వరలో ఆయనకు భారీ లాభం చేకూరుతుందని, ఈ స్కామ్‌కు సహకరించిన ఎంపీ పేరును వచ్చే ఎపిసోడ్‌లో చెబుతానన్నారు.
ఎవరా ఎంపీ
ప్రస్తుతం సీఎంకు సహకరిస్తున్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు అనేది చర్చగా మారింది. నిజంగానే బీజేపీ ఎంపీలు సీఎం రేవంత్‌కు సహకరిస్తున్నారా.. లేదా ఇష్యూను తమ ఖాతాలో వేసుకుని, హెచ్‌సీయూ భూములపై పోరాటాన్ని తమ క్రెడిట్‌గా వేసుకునేందుకే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ, తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కేటీఆర్ పలు పత్రాలను చూపిస్తున్నారు. బీజేపీ ఎంపీకి, సీఎంకు రహస్య ఒప్పందం ఉందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. అయితే, నిజంగానే సీఎంకు సహకరించే బీజేపీ ఎంపీలు ఉన్నారా.. అనే కోణంలో కూడా చర్చ సాగుతుంది. ఒకరిద్దరు మినహా.. బీజేపీలోని కీలక ఎంపీలు రేవంత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.