Friday, July 5, 2024

ఈనెలాఖరు లేదా వచ్చేనెలలో కాంగ్రెస్ రథసారధి ఎంపిక….!

రేసులో ప్రముఖులు
బిసిలకు ఈ పదవి వరించే అవకాశం
ఢిల్లీలో మకాం వేసిన మధుయాష్కీ, జగ్గారెడ్డి

ఈనెలాఖరు లేదా వచ్చేనెలలో టిపిసిసి అధ్యక్షుడి పదవిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 27వ తేదీ రేవంత్‌రెడ్డి మూడు సంవత్సరాలు పూర్తి కానుండడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసిస కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో పాటు ఎంపి బలరాం నాయక్, పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశమివ్వాలని మధుయాష్కీ కోరుతున్నట్లుగా సమాచారం. ఆయనతో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి సైతం వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్ వద్ద మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తనవంతు ప్రయత్నాలు చేయడం విశేషం.

మధుయాష్కీ విషయంలో ఏఐసిసి సానుకూలం
మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తన పేరును కూడా పరిశీలించాలంటే సిఎం రేవంత్ సహా ఏఐసిసి నాయకులతో మంతనాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏఐసిసి కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం ఈ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరడం విశేషం. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానం ముందుకెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సిఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పిసిసి అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం దాదాపు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడ్డియేతర సామాజిక వర్గాలకు పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

నెలాఖరు నాటికి పిసిసి అధ్యక్ష పదవి గడువు ముగియనుండడంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసిసి యోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పిసిసి సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తిస్థాయిలో నడుపుతున్నారు. కానీ, ఆయన్ను నియమిస్తే ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారన్న అంశంపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ ఎంపి మధుయాష్కీ విషయంలో ఏఐసిసి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడం, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా పార్టీ నామినేట్ చేయడంలో లబ్ధి పొందిన వారికి తిరిగి పిసిసి అధ్యక్ష పదవి లేదని ఏఐసిసి ఖరాఖండిగా చెబుతోంది. అయితే మొత్తంమీద బిసిలకు ఈ పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular