Wednesday, June 26, 2024

పొన్నం.. ఒడిత‌ల సతీష్‌.. హుస్నాబాద్లో గెలుపెవ‌రిది?

డిలిమిటేషన్ అనంతరం హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. 2004లో సిపిఐ నుండి చాడ వెంకటరెడ్డి, 2009 లో ముల్కనూర్ కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు అధ్యక్షుడు అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డిలు ఘన విజయం సాధించారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక‌ 2014లో జరిగిన ఎన్నికల్లో.. తెలంగాణ ఊపులో కెప్టెన్ లక్ష్మి కాంతారావు కుమారుడు ఒడితల‌ సతీష్ కుమార్ తెరాస నుంచి గెలుపొందారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అనామకులు గెలుపొందినట్లుగా.. తెలంగాణ ఉద్యమం ఊపులో ఎందరో సాధారణ వ్యక్తులు సైతం గెలిచిన సంద‌ర్భాలున్నాయి.

2018లో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో బీఆర్ఎస్‌ రెండోసారి అధికారం చేప‌ట్టింది. అదే ఊపులో స‌తీష్ కుమార్ విజ‌యం సాధించారు. సీఎం కేసీఆర్ రెండో ద‌ఫాలో 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చారు. ఆ క్రమంలో వివిధ‌ మండలాలు, జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గ పరిది, సరిహద్దులు పూర్తిగా మారిపోయాయి. గతంలో పాత కరీంనగర్ జిల్లాలో ఉండే హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం 3 జిల్లాల్లోని హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి అక్కన్నపేట, సైదాపూర్ మండలాల్లో విస్తరించి ఉంది. అంటే కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట మూడుజిల్లాల పరిధి అన్నమాట.

* 2023 ప్రస్తుత ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం లో 2 లక్షల 36 వేల మంది ఓటర్లున్నారు. ఇందులో ల‌క్షా పంతొమ్మిది వేల ఆరు వంద‌ల మంది మ‌హిళలు కావ‌డం గ‌మ‌నార్హం. 1,17,160 మంది పురుషులు ఓట‌ర్లు. ఇక్కనుంచి గతంలో కరీంనగర్ ఎంపీగా ఉండి పార్లమెంటులో తెలంగాణ కోసం తన గళాన్ని బలంగా వినిపించిన పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిజానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయా పార్టీల నాయకులు అక్కడ పోటీ చేసే నాయకులు ఎవర‌నే విష‌యంలో దృష్టి సారించాయి. అయితే టికెట్ ఎవ‌రిని వ‌ర్తిస్తుంది? పొత్తులో భాగంగా సీపీఐకి వెళుతుందా అనే ఆస‌క్తి రాజ‌కీయాల్లో ఉత్కంఠ రేపింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. హుస్నాబాద్‌లో పోటీ చేయాల‌ని భావించిన ముగ్గురు బ‌ల‌మైన అభ్య‌ర్థులే. మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ సీపీఐ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డిలు టికెట్ కోసం పోటీప‌డ్డారు. అయితే, టికెట్ పొన్నం ప్ర‌భాక‌ర్ ద‌క్కించుకోవ‌డంతో ప్ర‌వీణ్ రెడ్డి బీజేపీ లేదా స్వతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌బ‌డ‌తార‌ని అంద‌రూ ఊహించారు. ఎందుకంటే, ప్రవీణ్ రెడ్డి తండ్రి విశ్వనాథరెడ్డి ముల్కనూర్ బ్యాంక్, సమితికి అధ్యక్షుడిగా ఏంతో పేరుంది. అతని కుమారుడిగా ప్రవీణ్ రెడ్డి గత 25 ఏళ్ల నుంచి ముల్కనూర్ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. దాదాపు 16 గ్రామాల్లో 18 వేల ప్రజలు బ్యాంకులో సభ్యులుగా ఉన్నారు. అంటే, దాదాపు 40 వేల ఓటర్లను ప్రత్యక్షంగా ప్రవీణ్ రెడ్డి ప్రభావితం చేయగలిగే పరిస్థితి అన్న‌మాట‌. చాడ వెంక‌ట్ రెడ్డి కూడా పోటీలో ఉంటార‌ని భావించారు.

* పొన్నం ప్ర‌భాక‌ర్ క‌రీంన‌గ‌ర్ విడిచి హుస్నాబాద్‌కు రావ‌డానికి గ‌ల కార‌ణం.. ఆయా నియోజ‌క‌వ‌ర్గంలో గౌడ కుల‌స్తుల్లో 36 వేల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో బందుమిత్రవర్గలు అధికంగా ఉంది. గ‌తంలో కరీంనగర్ ఎంపీగా పొన్నం పోటీ చేసిన‌ప్ప‌టి ప‌రిధిలో అనేక మండ‌లాలు, గ్రామాలున్నాయి. ప్రవీణ్ రెడ్డి, చాడ వెంకటరెడ్డిల రాజకీయ భవితకు భరోసా కల్పించి హుస్నాబాద్ లో పొన్నం గెలుపుకు కృషి చేసేలా మలుచుకున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి పొన్నం విజయానికి దోహద పడే అంశం. పొన్నం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను గ‌ట్టిగా నమ్ముకున్నాడు. గతంలో బీఆర్ఎస్‌ పార్టీ నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరుగుతున్నాడు.

* గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ రామ్, ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ నుండి తెరాసలోకి వెళ్లి.. ఏ ఆధారణ లేక తిరిగి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో తనకు టికెట్ దక్కదని.. బీజేపీలో చేరి హుస్నాబాద్ నుండి బరిలో నిలిచారు. ఇక్కడ నిలబడిన అభ్యర్థులందరు ఒకతాను ముక్కలే. ప్రస్తుతం బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు అంతా గతంలో కాంగ్రెస్లో ఉన్నవారే. కేవలం కేసిఆర్ చరిష్మా, బీఆర్ఎస్‌ పథకాలు, పోల్ మేనేజ్‌మెంట్‌ను నమ్ముకుని సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ మూడోసారి గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ అన్నది తేలిపోయింది. అనేక సర్వే ఫలితాలు ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ, డిసెంబర్ మూడో తేదీన‌ విజయం హస్తగతం అవుతుందా లేక‌ కారు వశం అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

– వోరం న‌ట‌రాజ్ సుంద‌ర్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, టీఎస్ న్యూస్‌

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular