గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినన్నీ అభివృద్ధి పనులు దేశంలో మరెక్కడా జరగలేదు. ప్రతి విభాగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రత్యేకతను చాటుకున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఖ్యాతినార్జించిందంటే కేవలం కేటీఆర్ కృషి వల్లేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ.. గ్రామీణ ప్రజల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయింది? వారిలో నెలకొన్న వ్యతిరేకతను ఎందుకు గుర్తించకలేకపోయింది? ఈ విషయాన్ని సొంత పత్రిక అయిన నమస్తే తెలంగాణ అంచనా వేయడంలో ఎందుకు విఫలమైంది? అసలు కరోనా రాక ముందు వరకూ ఓటమి ఎరుగని సీఎం కేసీఆర్.. ఆతర్వాత ఎందుకు పలు ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చతికిలపడింది?
కరోనా కంటే ముందు నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్‌గా కట్టా శేఖర్‌రెడ్డి వ్యవహరించేవారు. ఆయన గ్రామీణ స్థాయి కంట్రిబ్యూటర్ నుంచి రాష్ట్రస్థాయి రిపోర్టర్లను సమానంగా చూసే వ్యక్తితత్వం గల వ్యక్తిగా పేరుంది. పైగా, అందరికీ అందుబాటులో ఉండేవారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని, ప్రజాభిప్రాయాల్ని ఎంతో నిశితంగా పరిశీలించేవారు. ఏ ప్రాంతలోనైనా అసంతృప్తి నెలకొందంటే.. అందుకు తగ్గ కథానాల్ని నమస్తే తెలంగాణలో ప్రచురించేవారు. ఆయా సమస్యకు పరిష్కారం చూపెట్టేలా కథనాల్ని రాయించేవారు. అవసరమైతే అధికారుల్ని అప్రమత్తం చేసేవారు. అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోతే హైలెవెల్‌కు సమాచారాన్ని పంపించేవారని సమాచారం. ఆయన ఎడిటర్‌గా ఉన్నంత కాలం అటు ప్రజలకు ఇటు అధికారులకు నమస్తే తెలంగాణ ఒక వారధిలా పని చేసేది. కాకపోతే, ఆయన రిటైర్ అయ్యాక అలాంటి పరిస్థితులు నమస్తే తెలంగాణలో లేవని సమాచారం.
* ప్రస్తుతం ఎడిటర్ గా వ్యవహరిస్తున్న తిగుళ్ల కృష్ణమూర్తి ఎవరి మాట వినే రకం కాదని సాక్షాత్తు నమస్తే తెలంగాణ ఉద్యోగులే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆయన వచ్చాక పత్రికలో పని చేసే అనేక మంది సీనియర్ జర్నలిస్టుల్ని వెళ్లగొట్టేశారు. కొందరిని పొమ్మనలేక పొగపెట్టి పంపించారని తెలిసింది. అయితే, ఆయనకి క్షేత్రస్థాయిలో పని చేసిన అనుభవం లేకపోవడం.. కింది స్థాయి రిపోర్టర్లు చెప్పే మాటల్ని వినకపోయేవాడని సమాచారం. తనేం చేయాలని అనుకుంటున్నాడో అది మాత్రమే చేయించేవారని నమస్తే తెలంగాణ జర్నలిస్టులు పలు సందర్భాల్లో వాపోయేవారని తెలిసింది. అందుకే, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అంతకుముందు వరకూ ఓటమి అంటే ఎరుగని కేసీఆర్‌కు అవే తొలి పరాజయాలు.
* బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంత కాలం అధికారిక పత్రిక అయిన నమస్తే తెలంగాణలో.. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వరుస కథనాల్ని రాస్తూ.. పరోక్షంగా ఆ పార్టీ ప్రతిష్ఠ హైదరాబాద్‌లో పెరిగేందుకు దోహదపడ్డారనే విమర్శలున్నాయి. ఆతర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఊహించిన దానికంటే అధిక సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి నమస్తే తెలంగాణ పత్రికలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌కు ప్రయోజనకరంగా మారిందని అందుకే మూడో సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. జీరో అయిన రేవంత్ రెడ్డిని వరుసగా వ్యతిరేక కథనాల వల్ల నమస్తే తెలంగాణ పత్రిక హీరోగా చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల కంటే ముందు వరకూ ఆయా పత్రికలో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ని వార్తలు వచ్చాయి? బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎన్ని వార్తలొచ్చాయనే అంశాన్ని గమనిస్తే అసలు విషయం అందరికీ అర్థమవుతుంది.
ఎవరు చెప్పినా వినే రకం కాదా?
నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరు చెప్పినా వినే రకం కాదని సమాచారం. ఆయన ఆలోచనలు వాస్తవానికి విరుద్ధంగా ఉండటంతో పలువురు కీలక జర్నలిస్టులు ఉద్యోగానికి రాజీనామా చేశారని తెలిసింది. ఇలాంటి వ్యక్తిని సీఎం కేసీఆర్ ఎలా నమ్మారని కొందరు జర్నలిస్టులు అయితే నెత్తినోరు మొత్తుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పని చేసిన కొందరు జర్నలిస్టులు గతంలో నమస్తే తెలంగాణలో పని చేసినవారే కావడం గమనార్హం. ఏదీఏమైనా, కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు.. సీఎం కేసీఆర్ ఓటమికి నమస్తే తెలంగాణ ఓ ముఖ్య కారణంగా అభివర్ణించొచ్చు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. నమస్తే తెలంగాణను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మాజీ సీఎం కేసీఆర్‌పై ఉంది. మరి, ఆయన ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.