టీఎస్న్యూస్: రాష్ట్రంలో పదేండ్లలో ఐఏఎస్అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తన భార్య పేరిట 25 ఎకరాలు కొన్నాడు. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ రజత్‌కుమార్ కూడా భారీగా భూములు కొన్నట్లు తేలింది. రజత్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 52 ఎకరాల భూమి ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజిపూర్లో సర్వేనెంబర్ 77,78,82తో పాటుగా అనుబంధ సర్వేల్లో 52 ఎకరాలు కొనుగోలు చేశారు. రజత్‌కుమార్ పేరుమీదే 15ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు వెల్లడైంది.
ఇటీవల భూమి మార్పడితో పాటుగా కొంత భూమిని అమ్మకానికి పెట్టడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రజత్‌కుమార్‌పై 2018 ఎన్నికల్లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎన్నికల కమిషన్ప్రధానాధికారిగా ఉన్న సమయంలో కొంతమంది బీఆర్ఎస్ఎమ్మెల్యేల అఫడవిట్ల విషయం, గెలుపులో రజత్ కుమార్ సాయం చేశాడనే అపవాదు ఉంది. అంతేకాకుండా నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న సమయంలో కూడా కాంట్రాక్టర్ల నుంచి భారీగా లబ్ధి పొందారనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆయనకు 52 ఎకరాల భూమి ఉన్నట్లు బయటకు రావడం.. అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వ అధికారులు ఇలాంటి ఆస్తులు, భూములు కొనుగోలు చేసినప్పుడు డీవోపీటీకి సమాచారం ఇవ్వాలనే నిబంధన ఉంది. డీవోపీటీకి సమాచారం ఇవ్వకుండానే భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది.
రజత్ కుమార్ వివరణ:
ఈ భూముల వ్యవహారంపై రజత్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు. 2013–-2014 సంవత్సరంలో జీఏడీ పర్మిషన్ తో భూమి కొనుగోలు చేశానని, భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉందని, 2019 వ సంవత్సరంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, 2013 సంవత్సరంలో కొనుగోలు చేసిన భూమిని 2021లో అమ్మానని, ఇది కూడా జేఏడీ కి సమాచారం ఇచ్చామన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే, రజత్‌కుమార్ 2021లో భూమి అమ్మానని చెబుతుండగా.. ధరణి వెబ్సైట్లో మాత్రం ఇంకా ఆయన పేరుతో భూమి ఉండటం మరో విశేషం.