భారత్ లో త్వరలోనే బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించే దిశగా చర్యలు చేపడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కీలక పాలసీ రేట్లు రెపో రేటు 6.5 శాతం వద్ద సరైన స్థాయిలోనే ఉందన్న ఆయన.. ఈ టైంలో ఈ వడ్డీ రేటును తగ్గిస్తే అది తప్పుదోవ పట్టించినట్లే అవుతందని చెప్పారు. అంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాలసీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో లేనట్లేనని అర్ధమవుతోంది.
ఆగస్టు 6వ తేదీ నుంచి 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెపో రేటును మరోసారి యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 9వ సారి రెపో రేట్లలో మార్పు చేయకుండా కొనసాగిస్తున్నట్లు ఆగస్టు 8న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండాలనే లక్ష్యం ప్రకారం ప్రస్తుత రెపో రేటు సరైన స్థాయిలోనే ఉందని ఈ సందర్బాంగా గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
అందుకే ప్రస్తుతం కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తే అది ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే అవుతుందని చెప్పుకొచ్చారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపునకు ఇద్దరు ఓటు వేయడం గమనార్హం. జయంత్ వర్మ, ఆషిమా గోయెల్ లు కీలక పాలసీ రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని సూచించారు. కానీ మెజారిటీ సభ్యులు పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించేందుకే ఓటు వేయడంతో వరుసగా తొన్నిదవ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని తెలుస్తోంది.