Saturday, November 16, 2024

ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై గత కొన్ని నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. బెయిల్‌ కోసం ఎన్నో సార్లు రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హై కోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా లాభం లేకుండా పోతోంది. ఐతే కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండగా ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్, హరీష్‌ రావు వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి సీనియర్ అడ్వకేట్స్ తో చర్చించారు. వారు ఇచ్చిన భరోసా మేరకు ఈ రోజు విచారణ తరువాత కవితకు బెయిల్‌ వచ్చి తీరుతుందనే నమ్మకంతో ఉన్నారట కేటీఆర్, హరీష్ రావు. ఈ కేసులో మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో, కవితకు కూడా బెయిల్‌ వస్తుందని ఆశిస్తున్నారు. అందుకే ఈ సారి కేటీఆర్, హరీష్ రావు తో పాటు సుమారు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఢీల్లీ వెళ్లారు. ఒకవేళ బెయిల్‌ వచ్చి, కవిత తీహార్ జైలు నుంచి బయటకు వస్తే పార్టీ ఆంతా కవితకు అండగా నిలిచిందనే సంకేతాలు పంపేలా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లారనే చర్చ జరుగుతోంది.

ఈ సారి కూడా కవితకు బెయిల్‌ రాకపోతే ఏంచేయాలన్నదానిపై బీఆర్ఎస్ ప్లాన్‌ బి ని సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. కవితను రాజకీయంగా వేధిస్తున్నారంటూ ఢిల్లీలో మెరుపు ధర్నా చేసి, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేలా ప్లాన్ చేశారన్న వాదన వినిపిస్తోంది. ఐతే దీనిపై ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావులు స్పందించలేదు. బెయిల్ రావడానికి అంతా అనుకూలిస్తున్న సమయంలో ధర్నాలు, నిరసనలు తెలపడం ద్వారా ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.ఏదేమైనా ఈ సారి మాత్రం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్ముతున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే గనుక జరిగితే కవితను ఒక ఊరేగింపుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే క్రమంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular