Friday, December 27, 2024

కొత్త వారికి పాత కేడర్ సహకరించేనా…?

  • మూడు పార్టీల్లో జంప్ జిలానీలకే పెద్ద పీట..!
  • ఆందోళనలో టికెట్‌లు దక్కిన అభ్యర్థులు
  • కేడర్‌ను దారికి తెచ్చుకునేలా సమాలోచనలు
  • రానున్న రోజుల్లో ప్రచారం ఎలా నిర్వహించాలో తెలియక సతమతం

మూడు ప్రధాన పార్టీలు సుదీర్ఘకాలం తమ పార్టీలో ఉన్న నేతలకిచ్చిన సీట్లకంటే వలస నేతలకు ఎక్కువ స్థానాలిస్తోంది. బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతూ అధిక స్థానాలను గెలుచుకునేలా వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా బిజెపి 17 మంది, బిఆర్‌ఎస్ 16 స్థానాలకు, కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే 17 ఎంపి స్థానాల్లో తొలి నుంచి బిజెపిలో ఉన్న నాయకులు ఇద్దరు మాత్రమే ఉండగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నుంచి చేరిన నాయకులకే ఈ సీట్లు ఎక్కువగా దక్కడం విశేషం.

గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఆ తరువాత బిజెపిలో చేరిన వారిలో ధర్మపురి అర్వింద్, డికె అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. అయితే తాజాగా బిజెపి పార్టీలో చేరిన వారిలో పోతుగంటి భరత్, బీబీపాటిల్, గోడం నగేష్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్, అజ్మీరా సీతారాం నాయక్, అరూరి రమేష్‌లు ఉన్నారు. తాండ్ర వినోద్ రావు, మాధవీలత స్వతంత్రులుగా ఉన్నారు. మెజార్టీ అభ్యర్ధులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బిజెపి బరిలో నిలిపి ఈ 17 స్థానాల్లో పోటీని రసవత్తరంగా మార్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 కొత్త అభ్యర్థులకు సహకరించేది అనుమానమే….!

అయితే వలసనేతలు అభ్యర్థులుగా మారడంతో నిన్నటి వరకు టికెట్ ఆశించిన ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్త అభ్యర్ధికి సహకరించడకుండా కొందరు మౌనం వహిస్తే మరికొందరు గోతులు తీస్తున్నారు. ఇంకొందరు పార్టీ నిర్ణయం పేరుతో అంటీముట్టనట్లు వ్యవహారిస్తున్నారు. పార్టీలో చేరిన నేతల అనుచరులు, పాత పార్టీ, కేడర్ మధ్య పొసగకపోవడంతో గ్రూపుల మధ్య అగ్గి రాజుకుంటోంది. కేడర్ ఎన్నికల ప్రచారంలో కొత్త అభ్యర్థులకు ఎంతవరకు సహకరిస్తారన్నది అంతుచిక్కని సమస్యగా మారింది. వలసనేత గెలిస్తే ఆయన అనుచరులకు ప్రాధాన్యత పెరిగి తమకు ఇబ్బందులు తప్పవని కేడర్ ఆలోచనగా తెలుస్తోంది.

డబ్బు, పలుకుబడి, కులబలం ఉన్న వారికే

గతంలో ఏదో ఒకరిద్దరు నాయకులు పార్టీ మారి అభ్యర్ధిగా బరిలో నిలిచేవారు. కానీ, రాజకీయ పరిస్థితులు మారిపోవడం చాలా కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులను కాదనీ ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి పార్టీ మారిన వారికి అవకాశం కల్పించి అందలమెక్కించడం ప్రస్తుతం రాష్ట్రంలో సాంప్రదాయంగా మారింది. ఏ పార్టీలోనైనా డబ్బు, పలుకుబడి, కులబలం, ఎన్నికల మేనేజ్ మెంట్ సత్తా ఉన్న వారికి పిలిచి పీట వేస్తున్నారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లది అదే పరిస్థితి….

కాంగ్రెస్ పార్టీ సైతం ఎంపి అభ్యర్థులకు సంబంధించి వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్‌లు కేటాయించింది. సొంత పార్టీ కంటే వలసనేతలకు పెద్దపీట వేసింది. పట్నం సునీతామహేందర్ రెడ్డి, దానం నాగేందర్, గడ్డం రంజిత్ రెడ్డి, నీలం మధు, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ ఇతర పార్టీలకు చెందినవారు కాగా, స్వతంత్రులు ఆత్రం సుగుణ కాంగ్రెస్‌లో చేరడంతో వారికి కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్‌లను కేటాయించింది. ఇక బిఆర్‌ఎస్ పార్టీ కూడా తక్కువ ఏమీ తినలేదు. ఆ పార్టీ కూడా వేరే పార్టీ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన వారికి పెద్ద పీట వేసింది. అందులో కాసాని జ్ఞానేశ్వర్, గాలి అనిల్ కుమార్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, క్యామ మల్లేషం, గడ్డం శ్రీనివాసరెడ్డిలను పోటీకి దింపింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com