భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతున్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి ఆదమ్‌పూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. ఎయిర్ వారియర్‌లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. నిజానికి ఇది అన్ ప్లాన్డ్ ప్రోగ్రామ్. నేటి ప్రధాని షెడ్యూల్‌లో ఆదమ్‌పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు. పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. అప్పటికప్పుడు ఆదమ్‌పూర్ ఎయిర్ బేస్ స్టేషన్‌ను సందర్శించాలని భావించారని, దీనితో రోజువారీ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం. భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ ఆదమ్‌పూర్ ఎయిర్ బేస్ స్టేషన్‌ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీజ్ ఫైర్ తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి సైతం ఆయన టీవీలో మాట్లాడారు.