బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పదంగా మారారు. బీఆర్‌ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానని వాటిని వేసుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మహిళలను కించపరచడం మానుకోవాలని, మరోసారి ఆడవారిని కించరుస్తూ మాట్లాడేతే చెప్పుదెబ్బలు తప్పవని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి హెచ్చరించారు.
ఈ సందర్భంగా లైవ్ లో చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో మహిళలను అవమానించేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన పోరాడింది మహిళలేనన్నారు. మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.
దరిద్రపు గొట్టు చరిత్ర అందరికీ తెలుసు : ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కౌశిక్ రెడ్డి దరిద్రపు గొట్టు చరిత్ర అందరికి తెలుసని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. పాడి కాశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందని దుయ్యబట్టారు. మొన్న కేటీఆర్, నేడు కౌశిక్ రెడ్డి మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని, బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే ఈ సమాజంలో ఎలా తిరుగుతారో చూస్తామన్నారు.
మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలి : గాంధీ భవన్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, బయటకు వచ్చి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార ప్రతినిధి భవానీ రెడ్డి డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి మాటలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలని, కౌశిక్ రెడ్డి బుడర్ ఖాన్ లాగా మాట్లాడుతున్నారని, భవిషత్తులో ఆయన బతుకు ఏ మయతదో అర్థం కాదన్నారు. కేసీఆర్ అధికారానికి అడ్డొచ్చిన వాళ్ళను ఆగం చేసిండని, కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ అని, దానికి నిదర్శనమే మహిళ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడమని అన్నారు.
కౌశిక్ రెడ్డికి పాడె కూడా కడతాం : పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యా రెడ్డి
కౌశిక్ రెడ్డికి పాడె కూడా కడతామని పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యా రెడ్డి హెచ్చరించారు. చీరలు..గాజులు.. మాకు కాదు..కేసీఆర్..కేటీఆర్ కి పంపాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల మొదలుపెట్టింది వారేనని, పాడి కౌశిక్ రెడ్డి కాదు..పాడే కౌశిక్ రెడ్డి అని మార్చుకో అని అన్నారు. వంట చేసిన చేతులు అనుకుంటున్నారని, ఆయనకు పాడె కూడా కడతామని అన్నారు.
బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నపుడు ఆ బుద్ధి ఏమైంది : మాజీ ఎంపీ హనుమంత్ రావు
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని, అప్పట్లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు గెలిచినప్పుడు ఎంతమందిని మీ పార్టీలోకి లాక్కున్నారో గుర్తు తెచ్చుకోండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైందని ప్రశ్నించారు. టీడీపీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం మర్చిపోయారా..? ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చిన విషయం గుర్తుందా ? అని మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏదో అన్యాయం జరిగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నారని, ఇది మొదలుపెట్టింది మీరే కదా? అని అన్నారు.