Friday, November 22, 2024

మహిళా సాధికారతకు పెద్దపీట

  • సిద్ధమవుతున్న 22 మహిళా శక్తి భవనాలు
  • శిల్పారామంలో 106 స్టాళ్ళతో ఇందిరా మహిళా శక్తి బజార్
  • తొలివిడతలో 1000 మెగా వాట్ల సామర్ధ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు
  • మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్ ల ఏర్పాటు, శిల్పా రామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ల ఏర్పాటు పనులు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ 22 ఇందిరా మహిళ శక్తి భవనాల నిర్మాణం పనులు మొదులుపెట్టి 8 మాసాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికై శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 106 షాప్ లతో ఏర్పాటు చేస్తున్న ఈ బాజార్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ మొదటి వారంలోగా ఈ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ఈ ఇందిరా మహిళా శక్తి బజార్లో నిత్యం వివిధ సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు చేయటానకి మహిళలకు ఆర్థిక చేయూతకై నగరంలోని ఐ.టి సంస్థలు, ఇతర ప్రముఖ వాణిజ్య, వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా పొదుపు సంఘాలను నిర్వహిస్తూ, అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేసిన మహిళా సంఘాలచే బస్సులను కొనుగోలు చేయించి వాటిని టీ.ఎస్.ఆర్.టీ.సి ద్వారా నిర్వహించేందుకు తగు ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఈ సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని, దీనిలో భాగంగా మొదటి దశలో 150 బస్సుల కొనుగోలును వెంటనే చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీ చేపడుతుందని అన్నారు. వీటితో పాటు మహిళా సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో 1000 మెగావాట్ల సామర్ధ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని వివరించారు. ఈ ప్లాంట్లను నీటిపారుదల శాఖ, దేవాదాయ, ఆటవీ శాఖలో నిరుపయోగంగా ఉన్న కాళీ భూములను లీజ్ పద్ధతిన సేకరించి ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు.

ఈ ప్లాంట్ల ఏర్పాటు అనంతరం వీటి నిర్వహణా భాద్యతలను తెలంగాణ రెడ్కో, విధ్యుత్ డిస్కం లు చేపడుతాయని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు పెద్ద మొత్తం లో ఆదాయం లభిస్తుందని సి.ఎస్ తెలిపారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, పీసీసీఎఫ్ ఆర్.యం.డోబ్రియల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, సెర్ప్ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular