Tuesday, December 24, 2024

జ‌గ‌న్.. భ‌జ‌న్‌.. యాత్ర‌ 2 మూవీ రివ్యూ

2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీ వి.రాఘవ్. మొదటి పార్ట్‌లో వైఎస్ఆర్ గురించి చూపించగా, యాత్ర 2లో ఆయన తనయుడు వైసీపీ అధినేత , సీఎం జగన్ గురించి తెర మీద చూపించడానికి ప్రయత్నాలు చేశాడు. వైఎఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా…జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర– 2 కొంతమేరకు పాజిటివ్​ టాక్​ వచ్చినట్టున్నా.. సినిమాలో కీలక అంశాలు మిస్​ అయ్యాయి. కేవలం జగన్​ కోసమే ఈ సినిమా అన్నట్టు తేలిపోయింది.

సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఎమోషనల్‌గా సాగాయి. ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం, ప్రజల కష్టల తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి. చంద్రబాబు, సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్‌ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది. జగన్‌ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు. యాత్ర– 2లో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపే అయిన్నప్పటికి ఆయన తన పాత్రకు న్యాయం చేశారు.

కసరత్తు కరువైన కథ
ఈ క‌థ గురించి మ‌హీ.విరాఘ‌వ ఎక్కువ క‌స‌ర‌త్తు చేసేందేమీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్​ మీడియాను ముందేసుకుని పరిశీలిస్తే సరిపోతుందనిపించేలా కథనం సాగింది. ఎంత బ‌యోపిక్ అయినా సినిమా వ‌న్ సైడ్ ఉండ‌కూడ‌దు. ఒక వైపే నిల‌బ‌డి మాట్లాడ‌కూడ‌దు. నిజాల్ని కొంతమేరకైనా చెప్పితే బాగుంటుంది. అదే సమయంలో బయోపిక్​లో చూపించేవారు చేసిన త‌ప్పుల్ని కూడా చూపించ‌గ‌లిగితే తప్పు ఏమిటో తెలుస్తుంది. కానీ, ‘యాత్ర 2’లో క‌నిపించ‌లేదు. కేవ‌లం జ‌గ‌న్‌కు ఈ సినిమా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉప‌యోగ‌ప‌డ‌డానికి త‌యారు చేసిన సొంత వీడియోలా మారింది. ఒక దశలో వాళ్లకు కావాల్సిందే వాళ్లు రాసుకున్నట్టుంది.

జగన్​ వదిలిన బాణమే ఈ బయోపిక్​
అంతేకాదు.. సినిమా మొత్తం తీసి, మ‌ళ్లీ జ‌గ‌న్‌కి చూపించి, ఆయ‌న‌కు ఇబ్బంది క‌లిగించే స‌న్నివేశాల్నీ, పాత్రల్నీ, సంభాష‌ణ‌ల్నీ మ‌ళ్లీ ఎడిట్ చేసి, చివ‌రికి జగన్​ నుంచి వ‌దిలిన సినిమాలా క‌నిపించింది యాత్ర–2. వైఎస్ఆర్​ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి రావడం, అంతకుముందు ప్రచారం నుంచి ఈ సినిమాను మొదలుపెట్టారు. సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం తర్వాత ఆయనకు ఎందుకో సంతోషం లేదనే కోణంలో ఈ సినిమా ముందుగానే అనిపించింది. ఆ తర్వాత జగన్​ను సోనియాకు పరిచయం చేయడం, అదే సమయంలో ఏఐసీసీ నేతలు పెద్దగా జగన్​ను పట్టించుకోకపోవడాన్ని కూడా ఒక కథగా చూపించారు. ఇదే సమయంలో జగన్​కూడా అప్పుడే ఏదో పెద్ద నేతగా ఫీల్​కావడం, సోనియా తనను పట్టించుకోలేదు.. తన తండ్రి పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు.. ఇవన్నీ ఎందుకు.. మనమే ఓ పార్టీ పెడుతాం అనే లెవల్లో కథను నడిపించినట్టే ఉంది. ఆ తర్వాత హెలికాప్టర్​ ప్రమాదంలో వైఎస్సార్ మ‌ర‌ణించ‌డం.. ఆ తర్వాత నుంచి సన్నివేశాలన్నీ కేవలం జగన్​ కోసమే అన్నట్టు సినిమా సాగింది.

జ‌గ‌న్ పార్టీకి రాజీనామా చేయ‌డం, ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం నుంచి కథ కొంత ముందుకు వచ్చింది. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టడం, తండ్రి తరహాలోనే రాజకీయాల్లో దూకుడు చేద్దామా అంటూ అక్కడి ప్రజలను రచ్చబండ కాడ అడుగడం ఆ తర్వాత నుంచి జగన్​ ఎదుర్కొన్న కష్టాలను చూపించారు. ఇక్కడే అక్రమాస్తుల కేసును అలా చూపించి.. ఇలా కట్​ చేశారు. కానీ, జైలులో ఉన్న కడప రెడ్డికి బయట నుంచి ఎవరు ఏం చేశారు.. పార్టీని ఎలా నడిపించారు.. జగనన్న వదిలిన బాణం ఏమైంది అనేది ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు కూడా.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవ‌లం రైతు రుణ‌మాఫీ అనే హమీ ఇవ్వకపోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ ఓడిపోయాడు అని చెప్పడం కొంత నవ్వు తెప్పించే అంశంగానే అనిపించింది. ఎందుకంటే అప్పటికే అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూపించడంలో దర్శకుడు ఫెయిల్​ అయినట్టు కొట్టచ్చింది. అంతే మొత్తంగా ప్రజల కోసం జగన్​ ఇచ్చిన మాట కోసం మాట తప్పడు.. మడమ తిప్పడు అనే కోణంలో మాత్రమే ఈ బయోపిక్​ ముగిసింది. జగన్​ జైలులో ఉన్నప్పుడు కేవలం విజయమ్మ మీదనే కథను నడిపించారు. కానీ, అప్పుడు “ జగనన్న వ‌దిలిన బాణాన్ని”అంటూ పార్టీని భుజాలపై వేసుకున్న షర్మిల కనీసం కనిపించలేదు.

రెండు అంశాలు మిస్సింగ్​
అంతేకాకుండా 2019 ఎన్నికలకు ముందు జరిగిన మరో కీలక పరిణామం కోడి,కత్తీ కేసు. కోడి, కత్తి శ్రీనివాస్​ను ఈ బయోపిక్​లో అసలే చూపించలేదు. అంతేకాదు.. జగన్​ బాబాయ్​వివేకా హత్య కూడా దాచి పెట్టారు. నిజానికి, ఈ రెండు అంశాలు ఏపీలో రాజకీయాలను టర్న్​ చేశాయి. మరి ఎందుకు వీటిని వదిలేశారు అనేది దర్శకుడు నిరూపించుకోవాల్సిందే. మరో సన్నివేశంలో ఏవో చిన్న పార్టీల మద్దతు అంటూ 2014 ఎన్నికలకు చూపించిన దర్శకుడు.. పవన్​ కళ్యాణ్​పార్టీ వ్యవహారాన్ని చూపించేందుకు జంకినట్టే కనిపించిం ది. జ‌గ‌న్‌కి సైతం.. జ‌న‌సేన అనే పేరు ప‌ల‌క‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ అనడం నచ్చవు. అందుకే వాటి జోలికి పోలేదు.

జ‌గ‌న్ ని ఎద‌గ‌నివ్వకుండా చేసేందుకు సోనియా గాంధీ స్థాయిలో అనుకోవడాన్ని చూపించడం కొంత ఎక్కువే. అంతేకాదు.. అక్రమ ఆస్తుల కేసులో జ‌గ‌న్‌ని ఇరికించమ‌ని చంద్రబాబు నుంచే సోనియాకు సలహాలు వెళ్లినట్టు సినిమాలో చూపించడం పూర్తిగా అపొహ. మరీ కొంత నవ్వు తెప్పించే అంశమేమిటంటే.. రాజకీయాల్లో ఏం చేయాలో తెలియకుండా తిరుగుతున్న జగన్​.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రమాదం జ‌రిగిన స్థలానికి వెళ్లడం, అక్కడో కేంద్ర విచారణ సంస్థలకు దొరకని ఓ సగం కాలిన పాకెట్​ డైరీ దొరకడం, అందులో ఇచ్చిన మాట నిల‌బెట్టుకో అనే వాక్యాన్ని చూపించడం, స‌మాధి ద‌గ్గర రాత్రంతా ఏడుస్తూ నిద్రలోకి జారుకున్న జగన్​కు తండ్రి కళలలో కనిపించడం కొంత అతిశయోక్తిగానే అనిపించింది.

ఇక, చివరకు నటీనటుల ఎంపికలో కూడా దర్శకుడు కొంత వెనకబడ్డాడు. చంద్రబాబు పాత్ర అసలే సూట్​ కాలేదు. చంద్రబాబు టీం కూడా సెట్​ కాలేదు. ఇటు జ‌గ‌న్ బాడీ లాంగ్వేజ్ ని జీవా దింపేశాడు. సోనియ‌మ్మ గెట‌ప్ బాగుంది. శుభ‌లేఖ సుధాక‌ర్ ఇచ్చిన ఎలివేష‌న్లు కూడా ఫర్వాలేదు. కానీ, జగన్​ టీం కూడా కరెక్ట్​ అనిపించలేదు. కేవలం నందిగాం సురేశ్​ మాత్రమే కరెక్ట్​గా సెట్​ అయ్యాడు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com