దేశద్రోహం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి విచారాధికారుల ఎదుట తన తప్పిదాన్ని అంగీకరించినట్లు సమాచారం. దానిష్‌తో మాట్లాడిన విషయాలను ఈ సందర్భంగా వెల్లడించినట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్‌కు దేశానికి సంబంధించి సమాచారం అందించిన కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంది. విచారణలో భాగంగా తాను పాకిస్తాన్ కోసం పనిచేశానని, దేశానికి సంబంధించి పలు విషయాలు చేరవేసినట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించడం కలకలం రేపుతోంది. భారత్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లి వచ్చిన విషయాలను, పాక్ ఏజెంట్లు కోరిన సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు సంస్థల ఎదుట జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు ఏబీపీ న్యూస్‌కు సమాచారం అందింది. పాకిస్తాన్‌లోని పలువురు సీక్రెట్ ఏజెంట్లతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఆమె సరిహద్దు దాటించడం నిజమేనని, పాకిస్తాన్ హై కమిషన్‌కు వెళ్ళి అధికారులను కలిసినట్లు అంగీకరించింది. తాజా సమాచారం ప్రకారం, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఆదేశాల మేరకు పనిచేసినట్లు తెలిపింది. పాకిస్తాన్ హై కమిషన్ అధికారి దానిష్‌తో ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నది. పోలీసులు, దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యపరిచే పలు విషయాలను విచారణలో భాగంగా ఆ యూట్యూబర్ వెల్లడించింది. జ్యోతి భద్రతా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలో, ” ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. 2023లో పాకిస్తాన్ వీసా కోసం పాకిస్తాన్ హై కమిషన్, ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ అహ్సాన్-ఉర్-రహీం అనే దానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దానిష్ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మా మధ్య మెస్సేజ్‌లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నేను రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాను” అని తెలిపింది.
పాకిస్తాన్‌లో జ్యోతిని కలిసిన జట్ రంధావా ఎవరు?
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో, ”నేను పాకిస్తాన్ వెళ్లిన తరువాత దానిష్ చెప్పడంతో అలీ హసన్‌ను కలిశాను. అలీ నాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. బయట తిరగడానికి సైతం వాహనాలు, సౌకర్యాలు కల్పించాడు. పాకిస్తాన్‌లో అలీ హసన్ నన్ను పాకిస్తాన్ భద్రతా, నిఘా అధికారులతో పరిచయం చేశాడు. అక్కడే నేను షాకిర్, రాణా షహబాజ్‌లను కలిశాను. నేను షాకిర్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను. ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని ‘జట్ రంధావా’ పేరుతో నా మొబైల్‌లో సేవ్ చేసుకున్నాను. షాకిర్ పాకిస్తాన్ రహస్య విభాగం అధికారి” అని సంచలన విషయాలు వెల్లడించింది.
జ్యోతి పాక్ ఏజెంట్లు, అధికారులతో తాను కాంటాక్ట్ అయ్యేది, వివరాలు ఎలా చేరవేసేదో కూడా విచారణలో అధికారులకు వివరించింది. ఆమె తన ప్రకటనలో, తాను వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఏజెంట్లు, అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని సైతం ఇదే మాధ్యమాల ద్వారా వారికి పంపించాను. ఢిల్లీలోని పాక్ హై కమిషన్‌లోని అధికారి దానిష్‌ను సైతం చాలాసార్లు కలిశాను” అని తెలిపింది. యూట్యూబర్ జ్యోతికి సంబంధించిన విషయం తెలియగానే పలు రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం మొదలైంది. యూట్యూబర్ జ్యోతితో సహ 11 మందిపై దేశ ద్రోహం కేసు నమోదైంది. జ్యోతి మల్హోత్రా, దేవేంద్ర సింగ్ దిల్హన్, తారిఖ్, నౌమన్ ఇల్లహి, అర్మన్, షహజాద్, మహ్మద్ ముర్తాజా అలీ, గజాలా, యామిన్ మహ్మద్, సుఖ్‌ప్రీత్ సింగ్, కరన్‌బీర్ సింగ్ లపై గూఢచర్యం రాజద్రోహం అభియోగాలున్నాయి. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కాగా, కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.