ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్దమవుతున్నారు. బ్రిటన్ లో చదువుకుంటున్న తన కూతురు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు యూకే వెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. వచ్చే నెల సెప్టెంబరు మొదటి వారంలో బ్రిటన్ వెళ్లడానికి అనుమతించాలని పిటీషన్ లో కోరారు. జగన్ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
మరోవైపు వచ్చే 6 నెలల్లో 60 రోజులు యూరప్ లో పర్యటించేందుకు అనుమతించాలంటూ జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడైన విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందని చెప్పారు. ఐతే విదేశాలకు వెళ్లడానికి విజయసాయి రెడ్డిని అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ముందుకు సాగడంలేదని, అందుకే యూరప్ వెళ్తానంటున్న విజయాసి రెడ్డి అనుమతిని నిరాకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30కి వాయిదా వేశారు.