ఫలితాలు చూసి షాక్ అయ్యానన్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూశాక.. షాక్ అయ్యానని, ఇదేంటి, ఇంత చేస్తే ఈ ఫలితాలేంటి.. అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది..
అని కామెంట్ చేశారట జగన్. మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల రిజల్ట్స్ చూసినప్పుడు తన మానసిక పరిస్థితిని నాయకులకు వివరించే క్రమంలో జగన్ ఈ మాటలు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే సమయం పట్టిందన్న జగన్.. ఐతే ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయని అన్నారట. అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్దమయ్యాక.. మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించిందని చెప్పుకొచ్చారట జగన్.
ఎన్నికల్లో ఇలా ఫలితాలు ఎందుకు వచ్చాయన్నదానిపై అనుమానాలు, కారణాలు ఏమైనప్పటికీ, మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలని కామెంట్ చేశారని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పారు.