Wednesday, April 16, 2025

అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయం

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ఉపకులపతి ప్రొ.అల్ధాస్ జానయ్య అధ్యక్షతన రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఈ సమావేశం జరిగింది. అనేక కీలకాంశాలను పాలకమండలిలో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాలకమండలి ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలను యూనివర్శిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

విశ్వవిద్యాలయంలో నూతనంగా విత్తన విభాగం ఏర్పాటు చేసి దానికి ఒక సంచాలకుడి స్థాయి అధికారిని నియమించి రాష్ట్రంలో ఒక విత్తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో కనీసం ఐదు నుంచి పది మంది అభ్యుదయ రైతులకు యూనివర్శిటీ రూపొందించిన నాణ్యమైన విత్తనాలను ప్రతి ఏటా సరఫరా చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నుంచి ప్రత్యేక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.

గత 13 ఏళ్ల నుండి ఇన్‌చార్జి పాలనతో నడుస్తున్న స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్న అంశానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల భారీగా పెంచిన ప్రత్యేక కోటా సీట్లలో ప్రవేశాలకు గాను భారీగా తగ్గించిన ఫీజులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాధిపతుల పదవికాలాన్ని మూడేళ్లుగా నిర్ణయిస్తూ ప్రతీ మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన, సీనియార్టీ ఆధారంగా విభాగధిపతులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఒకసారి విభాగాధిపతిగా నియామకం అయితే అతను లేదా ఆమె పదవీ విరమణ పొందే వరకు ఆ పదవిలో కొనసాగే వారని, దీనివల్ల ఇతర సీనియర్లకు అవకాశం కలుగకుండా పోతుందని పాలకమండలి భావించి దేశంలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలలో మాదిరిగా ఈ రొటేషన్ పద్ధతిలో విభాగ అధిపతులను నియమించాలని నిర్ణయించింది. వివిధ కళాశాలలో అనుబంధ పీఠాధిపతుల (అసోసియేట్ డీన్) నియామకం, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల అనుబంధ పరిశోధనా సంచాలకుల (అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్) సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని, వారి పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయిస్తూ, అలాగే మరో రెండేళ్ల వరకు పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా పాలకమండలి నిర్ణయించిందని ఆ ప్రకటనలో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది.

ఇటీవల యు.జి. సి ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ అనుభవం కలిగిన ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా ఏడాది కాలపరిమితితో మూడేళ్ల వరకు నియమించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పేరెన్నిక కలిగిన నిపుణుల యొక్క నైపుణ్యతను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనలలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. గత 7, 8 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల చెల్లింపులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు నాలుగు దపాలుగా విడుదల చేయాలని కూడా పాలకమండలి నిర్ణయించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉద్యోగులు, పెన్షనర్లకు గత ఐదేళ్ల క్రితం నుంచి నిలిపివేసిన యూనివర్సిటీ ఆరోగ్య కేంద్ర సేవలను పునరుద్ధరిస్తూ ఉపకులపతి అల్దాస్ జానయ్య ఇటీవల తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డిసెంబర్‌లో విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com