ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సందేశం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా వీడియో సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారని.. ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. అమరవీరుల కలలను నెరవేర్చాలి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కార్ అమలు చేస్తుందని ఆశిస్తున్నా అంటూ సోనియా వీడియో సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలంగా వర్ణించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి 2004లో కరీంనగర్ సభలో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని హామీ ఇచ్చానని గుర్తకు చేసుకున్నారు. సొంత పార్టీలో అసమ్మతి ఏర్పడిన కొందరు నేతలు తమ నిర్ణయాన్ని విభేదించి విడిపోయారని, అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. “ తెలంగాణ ప్రజలకు శుభం జరగాలి ” అంటూ జైహింద్ .. జై తెలంగాణ నినాదాలు చేసిన సోనియా.. సందేశాన్ని ముగించారు. కాగా, ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ట్విట్టర్ వేదికగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.