- సంక్షేమం మరియు అభివృద్ధి సమ పాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలుకు శ్రీకారం
- తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా: మంత్రి అనగాని సత్య ప్రసాద్
తిరుపతి, అక్టోబర్ 29: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, తిరుపతి జిల్లా అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల అమలుపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు లతో కలిసి జిల్లా అధికారులతో గౌ. తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి వర్యులు సమీక్ష సమావేశం నిర్వహించగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశిం సునీల్ కుమార్, కొరుగొండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితర ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రగతిపై కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీ వివరించగా పలువురు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి మార్గదర్శనంలో తిరుపతి జిల్లా లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువైన జిల్లాలో ఇంఛార్జి మంత్రిగా తాను రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా అభివృద్ధి చెందాలని పనిచేస్తున్న విజన్ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని కొనియాడారు. గౌ. ముఖ్యమంత్రి గారు మొదటగా తాను ఐదు ఫైళ్ళపై మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెంచిన పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైళ్లపై సంతకం పెట్టారని అన్నారు.
మెగా డిఎస్సీ సుమారు 16,347 ఉద్యోగాల ఫైలుపై సంతకం చేశారని అన్నారు. పెన్షన్ల పెంపు ద్వారా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ఒకటో తారీఖున లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని, తొలి రోజుననే సుమారు 95 శాతంపైగా పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతోందని, మన తిరుపతి జిల్లాలో చక్కగా అధికారులు సమన్వయంతో పెన్షన్ల పంపిణీ జరుగుతోందని అన్నారు. ప్రతి పేద వాడికి కడుపు నిండా మూడు పూటలా భోజనం పెట్టాలనే సదుద్దేశంతో నామ మాత్రపు ధర రూ.5 కే పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లలో అందిస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందనీ అన్నారు. 130 రోజుల్లో రోజుకు ఒక మంచి పని చేసేలా మంచి పథకాలు అందిస్తూ రోజుకు ఇరవై గంటలు మన ముఖ్యమంత్రి కష్టపడి పని చేస్తున్నరని కొనియాడారు. గత 5 సం.ల ప్రభుత్వంలో మన రాష్ట్రం 15 సం.ల వెనక్కు వెళ్ళిపోయిందని మన రాష్ట్రానికి పునః వైభవం తెచ్చేలా మన ముఖ్యమంత్రి అనుక్షణం పని చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం మొత్తం, మన దేశం, పరిశ్రమలు ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు మన సిఎం చంద్ర బాబు నాయుడు అని ప్రగాఢ విశ్వాసం వారికి ఉందని అన్నారు. రాబోయే 23 సం. లకు ప్రణాళికా వేసుకుని మన రాష్ట్రం అగ్ర స్థానంలో ఉండేలా చేయాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ప్రజలకు ఇసుక భారం కాకూడదని ఉచిత ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉచిత ఇసుక అందించే దిశలో ముఖ్యమంత్రి అనేక మార్గదర్శకాలు చేశారు. సీనేరేజి కూడా తీసేసారని, ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చర్యలు ఉంటాయని తెలిపారు. పక్కాగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉండాలని సూచించారు. ఉంచిత ఇసుక పాలసీ పై ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. పేదలకు అందుబాటులో ఇసుక ఉండాలనే లక్ష్యం అని, వారికి స్థానికంగా అందుబాటులో ఉండే ఇసుకను ఎడ్ల బండి, ట్రాక్టర్లతో వారి స్వంత అవసరాలకు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. యాప్ పారదర్శకంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో గత నాలుగు నెలల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయని తెలుపుతూ సిఎం గారు శ్రీసిటీ నందు పలు పరిశ్రమల ప్రారంభం, భూమి పూజ చేశారని గుర్తు చేశారు. అలాగే మన తిరుపతి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులు, ఇతర అవసరం నిమిత్తం వచ్చే వారు కలిపి సుమారు లక్ష మంది ప్రతి రోజు తిరుపతి జిల్లా సందర్శిస్తున్నారని, ఈ ప్రాంతాన్ని ఆతిథ్య రంగం, పర్యాటకంగా అభివృద్ధికి ఎంతో అవకాశాలు ఉన్నాయని అన్నారు.
రిసార్ట్స్ ఏర్పాటు ద్వారా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పులికాట్ సరస్సు ముఖ ద్వారం దగ్గర పూడిక తీసే కార్యక్రమం కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలలో ఫ్రీ హోల్డ్ పేరుతో పేదవారి భూములను అన్యాక్రాంతం చేసుకున్నారని మన తిరుపతి జిల్లాలో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రిజిస్ట్రేషన్ అయిన వాటి వెరిఫికేషన్ సర్వే ప్రక్రియ జరుగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి కాలేదని అందుకొరకు మరొక 15 రోజులు పొడిగించి నవంబర్ 15 నాటికి సదరు అంశంపై నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి కి నివేదించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. సదరు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగిన జిల్లాలలో తిరుపతి జిల్లా ఉన్నదని, వెరిఫికేషన్ ప్రక్రియ కొరకు7 గురు డిప్యూటీ కలెక్టర్లు ఈ పనిలో ఉన్నారని అన్నారు. అక్రమాలు జరిగిన వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పలు విలువైన సూచనలు ఈ సమావేశంలో ఇచ్చారని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని జిల్లాను ప్రగతిలో నడిపించుటకు అన్ని విధాల చర్యలు చేపడతామని తెలిపారు.
గంజా అరికట్టడానికి పోలీస్ జిల్లాలో చర్యలు చైతన్య పరచడం, ఎన్ఫోర్స్ చేయడం, కేసులు పెట్టడం జరుగుతోందని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గాంజా, డ్రగ్స్ రహిత రాష్ట్రం దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పేద వాడిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని అన్నారు.
విద్యుత్ అంశంలో కూడా స్పష్టంగా తెలియజేయడం అంటే 6400 కోట్ల భారం ప్రజలపై పెంచుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని, విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి లేదని, గతంలో 2015-19 లో మిగులు విద్యుత్ ద్వారా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. గతంలో నష్టాలు ద్వారా నే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడినది అని తెలిపారు. ప్రతి పేద వాడికి ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేసి 4500 కోట్ల రూపాయల ప్రణాళికలతో పలు కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు చేపట్టామని అన్నారు. రాబోవు జనవరి 2025 నాటికి ఆర్ అండ్ బి రోడ్లను గుంతలు లేని రోడ్లుగా చేసే దిశలో భాగంగా కేబినెట్ నిర్ణయం తీసుకుని పనుల మంజూరుతో పాటు పనులు ప్రారంభించి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలాగే పల్లె పండుగ కింద గ్రామీణ రహదారులు బాగు చేస్తున్నామని అన్నారు. ఇన్చార్జి మంత్రిగా అన్ని శాఖలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని సవరించి అన్ని విధాలుగా తిరుపతి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, మంచి సమాజం ఏర్పాటుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని అన్నారు.