ఇచ్చిన హామీలు అమలు చేసింది మా ప్రభుత్వమే
అవగాహన లేనివారే సినిమాలు తీస్తున్నారు
ఎమర్జెన్సీ చిత్రంపై భట్టి ఆగ్రహం
కేసీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇద్దరూ ఒకటేనని ఈ విషయం రాష్ట్రమంతా తెలుసునని విమర్శించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కూడా అలానే చేస్తుందని అనుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. కులగణనపై తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేస్తున్నామని అన్నారు. ఈ సర్వేతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. సర్వే ఆధారంగా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందిస్తామని.. పథకాలు అందరికీ చేరేలా చూస్తామని చెప్పారు. ఇందిరా గాంధీ స్పూర్తితోనే రాహుల్ గాంధీ ఎన్నికల్లో కులగణపై మాట్లాడారని అన్నారు. అందరికీ అవకాశాలు రావాలనే ఉద్దేశ్యంతోనే ఆ ప్రకటన చేశారని అభిప్రాయపడ్డారు.
సర్వేను కూడా శాస్త్రీయంగా చేస్తున్నామని, భారతదేశానికి ఈ కులగణన రోల్ మోడల్ గా నిలుస్తోందని వెల్లడించారు. దేశ సమగ్రతను దెబ్బ తీసేందుకే ఇందిరా గాంధీపై సినిమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, తెలిసినవారు చేతులెత్తి మొక్కుతారని చెప్పారు. దేశం పై అభిమానం లేనివారు కావాలనే ఆమెను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలను తృణంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా గాంధీ కుటుంబానిదని కొనియాడారు. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ హీరోయిన్ గా ఎమర్జెన్సీ సినిమాను తీసిన సంగతి తెలిసిందే.