తదుపరి విచారణ జూన్ 11న వాయిదా
గ్రూప్ 1 నియామకాలపై స్టే కొనసాగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. తదుపరి విచారణ జూన్ 11న వాయిదా వేసింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.గ్రూపు-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలపై స్టే విధించింది. తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. జూన్ 11న ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీజీపీఎస్సీ వాదనలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు స్టే ఎత్తివేస్తుందా లేదా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై వెలువడే తీర్పు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఇదీలావుంటే.. గ్రూప్ 1 అభ్యర్థుల నియామకంపై సింగిల్ బెంచ్ ఇప్పటికే స్టే విధించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ టీజీపీఎస్సీకు ఆదేశించింది. దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై సవాల్ చేస్తూ రెండ్రోజుల క్రితమే టీజీపీఎస్సీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అదే సమయంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. మళ్లీ విచారణ జరపాలని సింగిల్ బెంచ్ కు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులకు ముందే ఈ వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. తాజాగా మరోసారి విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది.