Saturday, May 17, 2025

పాక్‌ ఉగ్రవాదంపై దౌత్య యుద్ధం ఏడు అఖిలపక్ష బృందాల ప్రపంచ పర్యటన

పాక్‌ ఉగ్రవాదంపై దౌత్య యుద్ధం
ఏడు అఖిలపక్ష బృందాల ప్రపంచ పర్యటన

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధమైంది. ఇందుకోసం ఏడు అఖిలపక్ష బృందాలను కీలక మిత్రదేశాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలకు పంపనుంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఈ బృందాల విదేశీ పర్యటన మే 23 లేదా 24న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పది రోజుల పర్యటనలో భాగంగా ఒక్కో అఖిలపక్ష బృందం దాదాపు ఐదు నుంచి ఎనిమిది దేశాలకు వెళ్లనుందని సమాచారం. ఈ అంశంపై శనివారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం- ఏడు అఖిలపక్ష బృందాలకు బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్ఎస్‌పీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిలో నలుగురు ఎన్‌డీఏ కూటమికి చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు విపక్ష ఇండియా కూటమి నేతలు ఉన్నారు.

శశిథరూర్ పేరును ప్రస్తావించని కాంగ్రెస్ వర్గాలు
అఖిలపక్ష బృందాల కోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను కేంద్ర ప్రభుత్వం ఆచితూచి ఎంపిక చేసింది. అన్ని పార్టీలకూ ఈ బృందాల్లో చోటు కల్పించింది. ఎంపీలను ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల సిఫారసులను కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పరిగణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీల ఎంపికపై చర్చించేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ‌ విపక్ష నేత రాహుల్‌గాంధీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడారని సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్‌లకు అఖిలపక్ష బృందాలలో చోటు దక్కిందన్నారు. అయితే శశిథరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు.

ఇదొక గొప్ప గౌరవం- దేశం కోసం పిలిస్తే కాదని చెప్పలేను : శశిథరూర్
“భారత్ తరఫున విదేశాల్లో పర్యటించనున్న ఒక అఖిలపక్ష బృందానికి సారథ్యం వహించమని నన్ను కోరినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశం కోసం ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మా బృందం ఐదు ప్రధాన మిత్రదేశాల రాజధానుల్లో పర్యటిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని భారత్ వాణిని వినిపిస్తుంది. ఇటీవలే జరిగిన పరిణామాలు, ఘటనల గురించి వివరిస్తుంది. దేశ ప్రయోజనాల కోసం పిలిస్తే నేను కాదని చెప్పలేను. జైహింద్” అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒక పోస్ట్ పెట్టారు.

దేశం తరఫున విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నాం : సుప్రియా సూలే
“దేశం కోసం మేమంతా ఏకమయ్యాం. దేశం తరఫున త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నాం. ఒక అఖిల పక్ష బృందంలో ఉండమని నన్ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. అందుకు అంగీకారం తెలిపాను. ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అనే వివరాలను మేం అంతర్జాతీయ వేదికలపై చెబుతాం” అని ఒక అఖిలపక్ష బృందానికి సారథ్యం వహించనున్న ఎన్ఎస్‌పీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే మీడియాకు తెలిపారు.

ఉగ్రవాదంపై భారత్ పోరు- అంతర్జాతీయ సమాజానికి సందేశం
“ఉగ్రవాదంపై అన్ని మార్గాల్లో భారత్ రాజీలేకుండా జరుపుతున్న పోరు గురించి అఖిలపక్ష బృందాలు అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాయి. ఉగ్రవాదాన్ని భారత్ కించిత్తు కూడా సహించదనే విషయాన్ని తేల్చిచెబుతాయి. ప్రతి అఖిలపక్ష బృందంలో ప్రఖ్యాత దౌత్యవేత్తలు భాగంగా ఉంటారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఇకపైనా పోరును కొనసాగిస్తుందనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెబుతారు. కీలక మిత్రదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలకు అఖిలపక్ష బృందాలు వెళ్తాయి” అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పేర్కొంది. “ఈ నెలాఖరులో విదేశీ పర్యటనకు వెళ్లనున్న అఖిలపక్ష బృందాలు భారతదేశ ఐక్యతకు నిదర్శనాలు. రాజకీయాలతో సంబంధం లేకుండా భారత్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. దేశ ప్రయోజనాల కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాయి” అని పేర్కొంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com