-
మంత్రి మాటంటే ఆ శాఖ ఉన్నతాధికారికి లెక్కలేదు…!
-
ఆ శాఖ మంత్రికి తెలియకుండానే పనులన్నీ ఖతం…?
-
అటవీశాఖ మంత్రి వర్సెస్ ఆ శాఖ ఉన్నతాధికారి
-
సిఎం వద్దకు చేరిన ‘పంచాయితీ’
మంత్రి మాటంటే ఆ ఉన్నతాధికారికి లెక్కలేదు.. ఆ శాఖ మంత్రికి తెలియకుండానే ఆ శాఖలో పనులన్నీ జరిగిపోతాయి. కనీసం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎవరైనా ఆ శాఖ మంత్రి సిఫారసు లేఖను తీసుకుపోయినా ఆ ఉన్నతాధికారి లెక్కచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరి పంచాయితీ సిఎం వద్దకు చేరినట్టుగా తెలిసింది. ఆ శాఖలో మంత్రి వర్సెస్ ఉన్నతాధికారిగా వార్ నడుస్తోంది. కనీసం సంబంధిత మంత్రికి తెలియకుండానే ఆ అధికారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పటికే ఇదే విషయమై ఆ మంత్రి సిఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా తెలిసింది. అయినా ఆ అధికారిలో మార్పు రాకపోగా ప్రస్తుతం బదిలీల విషయంలోనూ ఆ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా వ్యవహారించారని మంత్రి సంతకం చేసిన జిఓను పక్కన బెట్టి 2018 జిఓ ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేశారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ బదిలీల్లోనూ భారీగా అవినీతి జరిగిందని ఉద్యోగులు మంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న ‘పంచాయితీ’ అటవీశాఖ ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది. అయితే ఆ ఉన్నతాధికారికి సచివాలయంలోని ఓ ముఖ్య అధికారి అండదండలు ఉన్నాయని, ఆ అధికారిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయనపై చర్యలు తీసుకోకుండా సచివాలయంలో పనిచేసే ఓ అధికారి అడ్డుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అటవీశాఖ ఉన్నతాధికారి స్థానంలో వేరొకరిని నియమించాలని మంత్రి సిఎంకు విన్నవించినా సచివాలయంలో పనిచేసే ఆ అధికారి అతనికంటే సమర్ధులైన అధికారులు లేరని సిఎంను సైతం తప్పుదారి పట్టిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు అటవీశాఖ ఉన్నతాధికారి తాను రిటైర్మెంట్కు దగ్గరలోనే ఉండడంతో ఉన్నన్నీ రోజులు తాను చెప్పిందే వినాలని కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు సూచించినట్టుగా తెలిసింది.
2018లో జారీ చేసిన జిఓ ఆధారంగా బదిలీలు
ప్రస్తుతం అటవీశాఖ ఉద్యోగుల బదిలీల్లోనూ ఆ అటవీశాఖ ఉన్నతాధికారి తన చేతివాటం ప్రదర్శించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా 2018లో జారీ చేసిన జిఓ 18 ఆధారంగా ఈ ట్రాన్స్‌ఫర్స్‌ను చేపట్టినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ఇచ్చిన జిఓను పక్కనబెట్టడంతో పాటు అటవీ శాఖ మంత్రి సంతకం చేసి జారీ చేసిన జిఓ 36, తేదీ 19.07.2024ను సైతం పక్కనబెట్టి, 2018లో జారీ చేసిన జిఓ నెంబర్ 18, తేదీ 01.06.2018 ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలను ఆ శాఖ ఉన్నతాధికారి చేపట్టినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే 2018లో జారీ చేసిన జిఓ ఆధారంగా ఆయన ఉద్యోగులను బదిలీ చేయడంతో ప్రస్తుతం అటవీశాఖ ఉద్యోగులు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. 2018లో జారీ చేసిన జిఓ 18కి సవరణలు చేయాలని అటవీశాఖ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు మంత్రికి, ప్రిన్సిపాల్ సెక్రటరీకి వినతి ఇవ్వడంతోనే జిఓ 36, తేదీ 19.07.2024కు మంత్రి ఆమోదం తెలిపినట్టుగా తెలిసింది.
పాత జిఓకు సవరణలు చేస్తూ కొత్త జిఓ జారీ చేసినా….
అయితే, 2018లో అప్పటి ప్రభుత్వం జిఓ 18ను జారీ చేసింది. ఆ జిఓలో అటవీశాఖ ఉద్యోగుల కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దానిలో భాగంగా ఉత్తమ ప్రతిభకనబర్చిన అటవీశాఖ ఉద్యోగులకు గ్రేడింగ్ ఇవ్వాలని దాని ఆధారంగా కౌన్సిలింగ్ చేయాలని, ఏ ఉద్యోగికి ఎంత గ్రేడింగ్ వచ్చిందన్న విషయాలను ఆయా ఉద్యోగులకు తెలపాలని, 15 రోజుల పాటు ఆయా ఉద్యోగుల అభ్యంతరాల స్వీకరణ తరువాత ఈ బదిలీలను చేపట్టాలని 2018, జూన్‌లో జిఓ 18ను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు 2018 సెప్టెంబర్‌లో గెజిట్ రూపంలో వెలువడ్డాయి. అయితే 2018లో వచ్చిన జిఓ 18ని అమలు చేయాలంటే ప్రస్తుతం బదిలీలకు సంబంధించి ఆర్థిక శాఖ ఇచ్చిన జిఓ అనుగుణంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున పాత జిఓకు సవరణలు చేస్తూ కొత్తగా జిఓ 36, తేదీ 19.07.2024ను జారీ చేశారు.
డిప్యూటేషన్ పంపించమన్నా డొంట్కేర్….
అప్పటికే అటవీ శాఖ ఉన్నతాధికారికి మంత్రితో పాటు ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బదిలీలను చేపట్టవద్దని సూచించినా వారి మాట లెక్కచేయని అటవీశాఖ ఉన్నతాధికారి ప్రస్తుతం 2018 సంవత్సరం జూన్‌లో జారీ చేసిన 18 జిఓ ఆధారంగా బదిలీలను చేపట్టడం విశేషం. అయితే ఈ జిఓలో ఉద్యోగులు పనితీరు, గ్రేడింగ్ ఆధారంగా బదిలీ చేయాలని ఉన్నా ఇక్కడ మాత్రం భారీగా డబ్బులు చేతులు మారాయని, దీంతో గ్రేడింగ్ లేకుండానే ఇష్టానుసారంగా బదిలీలు జరిగాయని ఆ శాఖ ఉద్యోగులు మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టుగా తెలిసింది. దీంతో మంత్రి అవాక్కయినట్టుగా సమాచారం. తాము పాత జిఓకు సవరణలు చేసి జారీ చేసిన జిఓను కాదనీ ఆ శాఖ ఉన్నతాధికారి ఇలా వ్యవహారించడంపై మంత్రి సీరియస్ అయినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఇద్దరు, ముగ్గురు అటవీశాఖ అధికారులను డిప్యూటేషన్‌పై పంపించాలని ఆ ఉన్నతాధి కారిని ఆదేశించినా ఆయన ఇప్పటివరకు మంత్రి మాటను పట్టించుకోలేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆ ఉన్నతాధికారిపై సిఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని సిఎంకు విన్నవించినట్టుగా తెలిసింది.